: విజయవాడ-విశాఖపట్నం మధ్య డెమో కారిడార్.. ప్రపంచ బ్యాంకు రుణానికి ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు

విజయవాడ-విశాఖపట్నం హైవేపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన అధ్యయనంలో ఈ రోడ్డుపైనే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు తేలింది. దీంతో ఈ రెండు నగరాల మధ్య డెమో కారిడార్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు రుణం కోసం ప్రతిపాదనలు రూపొందించింది. 2010లో రేణిగుంట-రాయలచెరువు మార్గాన్ని డెమో కారిడార్‌గా రూపొందించేందుకు కూడా వరల్డ్ బ్యాంకే సాయం అందించింది. అప్పట్లో రూ.36 కోట్లతో 136 కిలోమీటర్ల మేర డెమో కారిడార్‌ను నిర్మించారు. ప్రస్తుతం చేపట్టనున్న విజయవాడ-విశాఖపట్నం డెమోకారిడార్‌ ప్రాజెక్టును రవాణాశాఖ నోడల్ ఏజెన్సీగా చేపట్టనుంది. డెమో కారిడార్‌లో భాగంగా ప్రమాదకరంగా ఉన్న మూల మలుపులను, బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించి మరమ్మతులు చేస్తారు. రోడ్డుకు అదనపు వరసలు, బీమ్‌లు, జీబ్రాలైన్లు, రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేస్తారు. అలాగే ట్రామా కేర్ సెంటర్‌తో పాటు అత్యవసరం నిమిత్తం అంబులెన్స్ సౌకర్యం ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టు చేపట్టేందుకు మరో మూడేళ్లు పట్టే అవకాశం ఉండడంతో అప్పటి వరకు ఈ రహదారిపై ప్రమాదాలు జరగకుండా డమ్మీ ప్రమాద వాహనాలు ఉంచి వాహనదారులను హెచ్చరించాలని రవాణా శాఖ భావిస్తోంది.

More Telugu News