: కొంపముంచిన మతిమరుపు.. బ్యాంకులో రూ.1.5 లక్షలు మాయం.. లబోదిబోమంటున్న బాధితుడు

చిన్న పొరపాటుకు పెద్ద మూల్యం చెల్లించుకున్నాడో వ్యక్తి. బ్యాంకులో డ్రా చేసిన డబ్బులను లెక్కపెట్టి వాటిలో కొన్ని తీసి పక్కనపెట్టిన బాధితుడు వాటిని మర్చిపోయి ఇంటికెళ్లాడు. మళ్లీ వచ్చి చూస్తే కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టాడు. హైదరాబాద్‌లోని బోయిగూడలో జరిగిందీ ఘటన. స్థానికంగా నివాసముండే భాస్కర్ సోమవారం ఉదయం సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం ఎదురుగా ఉన్న ఆంధ్రాబ్యాంకులో రూ.8.5 లక్షలు డ్రా చేశాడు. ఆ డబ్బుల్లో రూ.1.5 లక్షలు స్నేహితుడికి ఇవ్వాల్సి ఉండడంతో ఆ మొత్తాన్ని బ్యాంకులోనే లెక్కపెట్టి పక్కనపెట్టుకున్నాడు. ఆ తర్వాత మిగతా డబ్బులు లెక్కపెట్టి సంచిలో వేసుకుని, పక్కన పెట్టిన డబ్బులను మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయాడు. ఇంటికి వెళ్లాక విషయం గుర్తొచ్చి బ్యాంకుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. అక్కడవి కనిపించకపోవడంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బ్యాంకుకు వచ్చిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించారు. అందులో బాధితుడు డబ్బులు లెక్కపెడుతున్న దృశ్యాలు నమోదు కాలేదు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News