: హైదరాబాద్‌లో దసరా సంబరాలు.. ఎవరెవరు ఎలా చేసుకుంటారో తెలుసా?

దసరా.. చెడుపై మంచి విజయం సాధించిన రోజు. అజ్ఞానంపై జ్ఞానంపై చేయి సాధించిన రోజు. దుఃఖం, దుర్బుద్ధి, దురాశ, దుర్మార్గం, దుర్నీతి వంటి వాటిని దుర్గమ్మ తుదముట్టించిన రోజు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం జగన్మాత ధరించిన 9 అవతారాల పరమార్థాన్ని మానవాళికి బోధించిన రోజే దసరా. ఈ పండుగను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా జరుపుకుంటారు. ఎవరెలా జరుపుకున్నా అమ్మవారి ఆరాధనే అసలు అంతరార్థం. ఇక భాగ్యనగరం హైదరాబాద్ విషయానికి వస్తే ఇక్కడ విభిన్న సంస్కృతులు కనిపిస్తాయి. ఒక్కొక్కరు ఒక్కోలా దసరా సంబురాలను అత్యంత వైభవంగా నిర్వహించుకుంటారు. మరి ఎవరెవరు ఎలా జరుపుకుంటారో చూద్దాం. కన్నడిగులు ఇలా చేస్తారు హైదరాబాద్‌లో ఏడు లక్షల మంది కన్నడిగులు నివసిస్తున్నట్టు అంచనా. వీరంతా దసరాను ప్రత్యేకంగా జరుపుకుంటారు. నవరాత్రుల ప్రారంభం రోజు ఘట ప్రతిష్ఠాపన చేస్తారు. కొత్తమట్టిని మూకుడులో పోసి నవధాన్యాలు చల్లుతారు. తొమ్మిది రోజులపాటు నిత్యం ఉదయం, సాయంత్రం నీళ్లు పోస్తారు. తొమ్మిదో రోజుకు నవధాన్యాలు మొక్కలవుతాయి. పదో రోజు దుర్గాదేవిని ఆరాధించి ఘటాన్ని గుడిలో వదిలేస్తారు. మైసూరు రాజసంప్రదాయాన్ని కన్నడిగులు ఆచరిస్తారు. రావణ సంహారమే దసరా ఈశాన్య భారతదేశంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హరియాణా వాసులు దసరా రోజు రావణాసురుడి ప్రతిమను దహనం చేస్తారు. రావణాసురుడిని రాముడు దసరా రోజే సంహరించాడనేది ఈశాన్య భారతీయుల విశ్వాసం. పెద్దపెద్ద రావణాసుడి ప్రతిమలను తయారుచేసి కాలుస్తారు. తెలంగాణలోని దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఖైరతాబాద్ రాంలీలా మైదానం, నందినగర్ చౌరస్తా తదితర చోట్ల ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఇక ఉత్తర భారతదేశానికి చెందిన వారు ఇంటి గోడలు, వంటగదిలో ప్రత్యేకంగా శక్తిమాట గుర్తులు వేసి పూజిస్తారు. మట్టికుండలో నవధాన్యలు వేసి ఆరాధిస్తారు. దశమినాడు ఆ మొలకలను చెవిలోనూ, తలపాగాలోనూ ఉంచుకుని పెద్దల ఆశీస్సులు తీసుకుంటారు. బెంగాలీల కాళీపూజ దసరా ఉత్సవాలకు పెట్టింది పేరు పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతా. బెంగాలీలకు ఇది అత్యంత ప్రీతికరమైన పండుగ. ఇక నగరంలో స్థిరపడిన బెంగాలీలు ఎవరి స్తోమతను బట్టి వారు పూజలు చేస్తారు. 9 రోజులు, ఐదు రోజులు, 3 రోజులు.. ఇలా ఎవరికి తగ్గట్టుగా వారు దుర్గామాతను ప్రతిష్ఠించి పూజలు చేస్తారు. జంతుబలికి బదులుగా గుమ్మడి, కొబ్బరికాయ వంటి వాటిని అమ్మవారికి బలిగా సమర్పిస్తారు. 9 రకాల ఫలాలతో అమ్మవారిని ఆరాధిస్తారు. విజయదశమి రోజున అమ్మవారి రూపును నిమజ్జనం చేస్తారు. ఒడిశావాసులకు పెద్ద పండుగ ఒడిశా వాసులకు దసరా పెద్ద పండుగ. సాధారణంగా దశమికి పది రోజుల ముందు పూజలు మొదలవుతాయి. కానీ ఒడిశాలో మాత్రం విజయదశమి నుంచి పది రోజులపాటు అపరాజితాదేవిని పూజిస్తారు. తమిళనాడు కేలెండర్‌ను అనుసరించే వీరు అమావాస్యను పవిత్రమైన రోజుగా భావిస్తారు. అమావాస్య రోజున అమ్మవారిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. పూజలు నిర్వహించే పదిరోజులూ రోజుకు పది రకాల నైవేద్యాలతో అమ్మవారిని పూజిస్తారు. అయితే ఎవరు ఎలా జరుపుకున్నా తమను తాము తీర్చి దిద్దుకోవడం, అజ్ఞానాన్ని దూరం చేసుకుని జ్ఞానమార్గాన్ని అనుసరించడమే దసరా ముఖ్య ఉద్దేశం.

More Telugu News