: అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో మన‌దే అగ్ర‌స్థానం: ముఖ్యమంత్రి చంద్ర‌బాబు

భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌న సంస్థ ఇస్రో ఎన్నో విజ‌యాలు సాధిస్తోంద‌ని, అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో మ‌న‌దే అగ్ర‌స్థాన‌మ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అన్నారు. విశాఖప‌ట్నంలోని ఆంధ్ర‌యూనిర్సిటీలో ఈరోజు అంత‌రిక్ష వారోత్స‌వాల ముగింపు కార్య‌క్ర‌మం జ‌రుగుతోంది. అందులో పాల్గొన్న చంద్ర‌బాబు నాయుడు ప్ర‌సంగిస్తూ... అంత‌రిక్ష రంగంలో ఇస్రో బ్ర‌హ్మాండ‌మైన పురోగ‌తి సాధిస్తోందని అన్నారు. ఏపీ యూనివ‌ర్సిటీల‌కు ఇస్రో సాంకేతిక సాయం అందిస్తోందని చెప్పారు. అన్ని వ‌ర్సిటీలు ప‌రిశోధ‌న కేంద్రాలుగా త‌యారు కావాలని, విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని విజ‌యాలు సాధించాల‌ని అన్నారు. స‌తీష్ ధావ‌న్ అంత‌రిక్ష కేంద్రం ఏపీలో ఉండ‌డం మ‌న అదృష్టమ‌ని చంద్రబాబు అన్నారు. ఇస్రోతో ఏపీ ప్ర‌భుత్వానికి ఒప్పందం కుదిరింద‌ని, మన విశ్వ‌విద్యాల‌యాల‌కు ఇస్రో సాంకేతిక ప‌రిజ్ఞానం అందించ‌నుంద‌ని చెప్పారు. వినూత్న ఆలోచ‌న‌ల‌తో ముందుకువెళితే మంచి భ‌విష్య‌త్తు ఉంటుంద‌ని చంద్ర‌బాబు అన్నారు. విద్యార్థులు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త‌గా ఆలోచించాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అమెజాన్‌, ఫ్లిప్ కార్ట్ వంటి సంస్థ‌లు కూడా వినూత్న‌మైన ఆలోచ‌న‌ల‌తోనే వ‌చ్చాయని, మంచి విజ‌యాన్ని సాధించాయ‌ని అన్నారు. వినూత్న ఆలోచ‌న‌తోనే ఉబెర్ లాంటి క్యాబ్‌లు వ‌చ్చాయ‌ని చెప్పారు. ఆధునిక‌ సాంకేతిక ప‌రిజ్ఞానం వినియోగించకపోతే అభివృద్ధి సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. ఏయూలో ఈరోజు మంచి కార్య‌క్ర‌మం జ‌రుపుతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అంత‌రిక్ష ప‌రిజ్ఞానంలో అన్ని వ‌ర్సిటీలు పోటీ ప‌డుతున్నాయని చెప్పారు. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉందని అన్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం రాష్ట్రంలో ప్ర‌తి ఇంటికి ఫైబ‌ర్ గ్రిడ్ ద్వారా ఇంట‌ర్నెట్, టీవీ ఛానెళ్లు, ఫోన్ స‌దుపాయం క‌ల్పిస్తుంద‌ని చెప్పారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇస్రో ఛైర్మ‌న్ కిర‌ణ్‌కుమార్‌, ఏయూ వీసీ నాగేశ్వ‌ర‌రావు, ఏపీ మంత్రులు అయ్య‌న్న పాత్రుడు, గంటా శ్రీ‌నివాస‌రావు, ఎంపీ హ‌రిబాబు, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

More Telugu News