: జయ సంతకాలు ఫోర్జరీ కావచ్చు... గవర్నర్ కు శశికళ పుష్ప లేఖ

ఓవైపు జయ ఆరోగ్యంపై ఆందోళన కొనసాగుతుండగానే... మరోవైపు, తమిళ రాజకీయాల్లో పరిణామాలు అత్యంత వేగంగా మారుతున్నాయి. పరిపాలన సజావుగా సాగేందుకు తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలని విపక్షం డిమాండ్ చేస్తుండగా... మరోవైపు, జయ కోలుకుంటున్నారని, ఆ అవసరం లేదని అధికారపక్ష నేతలు కొట్టిపడేస్తున్నారు. ఈ క్రమంలో, ఏఐడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప తమిళనాడు తాత్కాలిక గవర్నర్ కు రాసిన లేఖ సంచలనం రేపుతోంది. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ముఖ్యమంత్రి జయ సంతకాన్ని పార్టీలోని కొందరు ఫోర్జరీ చేసే అవకాశాలు ఉన్నాయని లేఖలో ఆమె పేర్కొన్నారు. దీనికి సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. శశికళ లేఖ నేపథ్యంలో, తాత్కాలిక ముఖ్యమంత్రిని నియమించాలనే వాదనకు మరింత బలం చేకూరినట్టయింది. అంతేకాదు, జయలలితకు ఏమీ తెలియని స్థితిలో... తెరవెనుక ఏదైనా జరుగుతోందా? అనే అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు, ఫోర్జరీ డాక్యుమెంట్లకు సంబంధించి కోర్టు కేసును శశికళ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

More Telugu News