: ఉగ్రవాదుల కోసం పాక్ లోకి వస్తాం... అధికారికంగా పాక్ కు చెప్పిన భారత్!

ఉగ్రవాదులకు ఇదే విధమైన మద్దతు పాక్ నుంచి లభిస్తున్న పక్షంలో ఎల్ఓసీ నిబంధనలను తాము పాటించబోమని, ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సరిహద్దులు దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి ప్రవేశిస్తామని పాకిస్థాన్ కు స్పష్టం చేసినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. 1999 నాటి కార్గిల్ యుద్ధంతో పోలిస్తే, ఇప్పడు భారత వైఖరి వేరుగా ఉందని, వాస్తవాధీన రేఖకు విలువ ఇవ్వకుండా, దాన్ని మార్చాలని భావిస్తే ఊరుకోబోయేది లేదని స్పష్టం చేసినట్టు తెలిపారు. పాక్ వైపు నుంచి చొరబాట్లు ఆగని పక్షంలో, ఇండియా వైపు నుంచి కూడా చొరబాట్లు చేసే హక్కు తమకుందని వెల్లడించినట్టు తెలిపారు. 2004 జనవరి 6న అప్పటి పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్, తమ భూభాగం వేదికగా భారత్ పై ఉగ్రదాడులకు సహకరించబోమని అధికారిక ప్రకటన చేసినప్పటికీ, దాన్ని ఇంతవరకూ ఆచరణలో మాత్రం చూపలేదన్నది అందరికీ తెలిసిందే. ఎల్ఓసీ వెంబడి వున్న పాక్ గ్రామాల నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని, వీటిని పాక్ సైన్యం దగ్గరుండి ప్రోత్సహిస్తూ, ఆపై వారు జరిపే మారణకాండను చూస్తోందని ఆరోపించిన భారత్, ఇకపై అలా జరగనివ్వబోమని పాక్ కు తెగేసి చెప్పినట్టు తెలుస్తోంది. ఇక ఎవరైనా దాడి చేస్తే తమను తాము రక్షించుకుంటూనే దేశాన్ని కాపాడగల శక్తి సామర్థ్యాలను పుష్కలంగా కలిగివున్న భారత సైన్యం, ఇకపై ఆ ప్రమాదం జరిగేంత వరకూ వేచి చూడకుండా, ముందుగానే నివారించే మార్గలను అన్వేషించాలన్న వ్యూహానికి మారుతోందని ప్రభుత్వ ఉన్నత వర్గాలు పేర్కొన్నాయి. ప్రతి నిత్యమూ చొరబాటు యత్నాలు జరుగుతుండటం, వాటిని సైన్యం దీటుగా అడ్డుకోవడం చూస్తూనే ఉన్నా, ఎప్పుడో ఒకప్పుడు ఉగ్రవాదులు తమ చొరబాటును విజయవంతం చేయవచ్చన్న ఆలోచన ఆందోళనకు గురి చేస్తున్న వేళ, ముందస్తు చర్యలు చేపట్టే దిశగా, భారత సైన్యమే దాడులకు దిగాలన్న ఆలోచనకు మద్దతు పెరుగుతోంది.

More Telugu News