: దేశవ్యాప్త సమ్మెకు కదులుతున్న కేంద్ర ఉద్యోగులు!

7వ పే కమిషన్ సిఫార్సుల అమలు జాప్యంపై గుర్రుగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరోసారి సమ్మెకు దిగే ఆలోచనలో ఉన్నారు. కమిషన్ సిఫార్సుల మేరకు అలవెన్సులు, కనీస వేతనం, ఫిట్ మెంట్ ఫార్ములాను అమలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే కదలాలంటూ డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం స్పందించకుంటే సమ్మె మినహా మరో మార్గం లేదని కుండబద్దలు కొడుతున్నాయి. అలవెన్సుల విషయంలో తుది నిర్ణయం తీసుకునేందుకు 13వ తేదీన డిపార్ట్ మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ విభాగ అధికారులతో జరగాల్సిన సమావేశం సైతం, 25వ తేదీకి వాయిదా పడింది. ఈ నెలలోనే అలవెన్స్ కమిటీ సిఫార్సులు వస్తాయని, వాటిని నవంబర్ లో అమలు చేస్తారని భావిస్తున్నామని వెల్లడించిన కర్ణాటక ఉద్యోగ సంఘాల ప్రతినిధి ఒకరు, అలా జరుగకుంటే, సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. కనీస వేతనాలపై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం, ఇంతవరకూ అటువంటి చర్య తీసుకోలేదని ఆయన విమర్శించారు. అడ్వాన్సుల ఆదేశాలు జారీ చేయడంలో చూపుతున్న తొందర, అలవెన్సులు, కనీస వేతనం విషయంలో చూపించడం లేదని అన్నారు.

More Telugu News