: ముస్తాబైన 21 కొత్త జిల్లాలు.. రాష్ట్రావతరణ స్థాయిలో సంబురాలకు సిద్ధమవుతున్న ప్రభుత్వం

విజయదశమి పర్వదినం రోజున తెలంగాణలో మరో 21 కొత్త జిల్లాలు కొలువుదీరనున్నాయి. ప్రస్తుతమున్న 10 జిల్లాలను 31 జిల్లాలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 21 కొత్త జిల్లాలతోపాటు 24 రెవెన్యూ డివిజన్లు, 120 కొత్త మండలాలకు ప్రభుత్వం ఓకే చెప్పింది. రేపు(మంగళవారం) అధికారికంగా నిర్ణయించిన ముహూర్తానికి కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. ఇక కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్సవాలను రాష్ట్రావతరణ ఉత్సవాల స్థాయిలో నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. సిద్ధిపేట జిల్లా ప్రారంభ వేడుకలకు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా హాజరుకానున్నారు. కొత్త జిల్లాలకు కలెక్టరు, ఎస్పీల నియామకానికి సంబంధించిన ఫైలు తుది పరిశీలన కోసం సీఎం వద్దకు చేరింది. హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు పాత కలెక్టర్లనే కొనసాగించి మిగతా జిల్లాలకు నియామకాలు చేపట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం జరిగిన కేబినెట్ భేటీలో 31 జిల్లాలకు ఆమోదం తెలిపారు. అయితే తాజాగా షాద్‌నగర్‌ను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం, అదే డివిజన్ పరిధిలోని నందిగామను మండలంగా ఏర్పాటు చేయాలని ఆదివారం రాత్రి నిర్ణయించారు. దీంతో రాష్ట్ర మంత్రివర్గం సోమవారం అత్యవసరంగా భేటీ అయి కేబినెట్ ఆమోద ముద్ర వేసి తుది నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సమాచారం. ఒకవేళ భేటీ జరగకున్నా మంత్రుల సంతకాలతో ఫైలును ఆమోదించి ప్రకటించే అవకాశం ఉనట్టు తెలుస్తోంది.

More Telugu News