: ఫ్రీగా ఉంటే 3 గంటలు.. బిజీగా ఉంటే అరగంట.. మరీ బిజీగా ఉంటే కారులోనే పూజ చేస్తా: సినీ దర్శకుడు కోడి రామకృష్ణ

ఫ్రీగా ఉంటే 3 గంటలు.. బిజీగా ఉంటే అరగంట పాటు పూజ చేస్తానని సీనియర్ సినీ దర్శకుడు కోడి రామకృష్ణ అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, "ఒక రోజు కాలువలో పడి నేను కొట్టుకుపోతుంటే.. మధ్యలో ఒక వ్యక్తి నన్ను బతికించాడు. ఈ విషయాన్ని అమ్మకు చెబితే.. బాధ, కోపం, ప్రేమతో నన్ను బాగా కొట్టింది. దేవుడికి దండం పెట్టకుండా, పూజ చేయకుండా బయటకు వెళ్లొద్దు అని ఆరోజు చెప్పిన మాటలు ఈరోజు వరకు నేను పాటిస్తూనే ఉన్నాను. అందుకే, ఫ్రీగా ఉంటే 3 గంటలు పాటు.. బిజీగా ఉంటే అరగంట పూజ చేస్తాను. మరీ బిజీగా ఉంటే నేను ప్రయాణిస్తున్న కారులోనే పూజ చేసేస్తాను. నా చేతికి రకరకాల తాళ్లు ఉంటాయి, అవన్నీ ఎవరో ఒక స్వామీజీ కట్టినవే. అదేవిధంగా, నా చేతికి ఉంగరాలు ఉండటం కూడా సెంటిమెంటే. ఇక, షూటింగ్ సమయంలో నా తలకు కట్టుకునే బ్యాండ్ గురించి చెప్పాలంటే... నా రెండో చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సమయం అది. బాగా ఎండగా ఉంది. ఇంతలో చిత్ర యూనిట్ లో వాళ్లు ఒకరు వచ్చి నా నుదురుకు ఎండ తగలకుండా కట్టుకోమని ఒక క్లాత్ ఇచ్చారు. ‘నీ ఫోర్ హెడ్ పెద్దది. ఎండ బాగా తగులుతుంది. ఇది కట్టుకో’ అని అన్నారు. ఇక, అప్పటి నుంచి ఇప్పటివరకు అదే పద్ధతి. నా కన్నా ఎక్కువగా నా తలకు కట్టుకునే బ్యాండ్ ఫేమస్ అయిపోయింది’ అని కోడి రామకృష్ణ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

More Telugu News