: అది తారు రోడ్డు కాదు.. మిలమిలా మెరిసే 'స్టార్' రోడ్డు!

తారు రోడ్డు.. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నగరాలను అనుసంధానించే ఈ రోడ్లకు కవుల వర్ణనల్లోనూ చోటుంది. ‘నిద్రపోతున్న నల్లతాచులా ఉన్న ఆ తారు రోడ్డుపై ఓ వాహనం వేగంగా దూసుకెళ్తోంది’.. అంటూ వర్ణించే కవులు ఎందరో. అయితే ఇప్పుడు చెప్పబోయే రోడ్డు మాత్రం తారు రోడ్డు కాదు.. స్టార్ రోడ్డు. ఎందుకంటే రాత్రివేళ్లలో ఆకాశంలోని నక్షత్రాలు ఈ రోడ్డుపై ఎంచక్కా కనిపిస్తాయి. మిలమిలా మెరిసే ఈ రోడ్డును పోలెండ్‌లో ప్రత్యేకంగా నిర్మించారు. రాత్రిళ్లు సైకిళ్లపై ప్రయాణించే వారి కోసం ఓ సాంకేతిక సంస్థ ప్రత్యేకంగా దీనిని డిజైన్ చేసింది. ఇది పగలంతా సూర్యుడి వెలుగును పీల్చుకుని రాత్రి వేళ్లలో వెలుగులు విరజిమ్ముతుంది. రాత్రి వేళల్లో సైకిళ్లపై ప్రయాణించే వారు దారి కనిపించకపడే ఇబ్బందులను పరిష్కరించే లక్ష్యంతో ఈ రోడ్డును నిర్మించారు. నీలం రంగులో మెరిసే ఈ రోడ్డు రంగులు కూడా మార్చుకోగలదు. ప్రపంచంలో ఇటువంటి రోడ్డు ఇదొక్కటే కాదు. గతంలో ప్రముఖ చిత్రకారుడు విన్సెంట్ స్వస్థలమైన నెదర్లాండ్స్‌లోని సెయెనెన్‌లో కూడా ఇటువంటి రహదారిని నిర్మించారు. కాగా, తాజాగా ఏర్పాటు చేసిన రోడ్డు రాత్రుళ్లు మిలమిలా మెరవడమే కాకుండా ఎక్కువ కాలం చెక్కుచెదరకుండా ఉంటుందని డిజైనర్లు చెబుతున్నారు. ఏది ఏమైనా, ఈ రోడ్డుపై సైకిల్ సవారీ మధురానుభూతిగా మిగిలిపోతుందనడంలో సందేహం లేదు.

More Telugu News