: చైనా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు.. ఇపుడు అన్ని దేశాలు భారత్ వైపే చూస్తున్నాయి: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టే వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలో ఈరోజు సీఐఐ నాలుగవ సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. అందులో చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. ప్రస్తుతం అన్ని దేశాలు అభివృద్ధిలో దూసుకుపోతోన్న‌ భారత్ వైపే చూస్తున్నాయని ఆయన అన్నారు. చైనా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ప్రపంచం దృష్టి మ‌నదేశంపై ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రెండంకెల వృద్ధిని సాధించింద‌ని, భార‌త్‌లోనే ఆ ఘ‌న‌త సాధించిన ఏకైక రాష్ట్రంగా గుర్తింపు పొందింద‌ని చంద్రబాబు పేర్కొన్నారు. సీఐఐకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ న‌వ్య‌రాజధాని అమరావతిలో స్థలం కేటాయిస్తామని పేర్కొన్నారు. ఏపీలో పెట్టుబ‌డుల‌ను ఆహ్వానిస్తూ.. పరిశ్రమలు పెట్టేందుకు వస్తే వెంట‌నే అనుమతులు ఇస్తున్న‌ట్లు తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాప‌న‌కు అనువైన వాతావరణం ఉంద‌ని చెప్పారు. అన్ని స‌దుపాయాలు క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. నిరంత‌ర విద్యుత్‌, మానవ వనరులు ఉన్నాయని చెప్పారు. సాంకేతిక‌త‌, ఐవోటీని పాలనలో భాగం చేసిన‌ట్లు పేర్కొన్నారు. అందుకోసం తమ నేత‌ల‌కు శిక్షణ కూడా ఇచ్చామని చెప్పారు. రాష్ట్రాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామ‌ని అన్నారు.

More Telugu News