: అలాంటప్పుడు ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయండి: రాం విలాస్ పాశ్వాన్

బీహార్ లో ఎక్కడైనా మద్యం లభిస్తే... వెంటనే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను అరెస్ట్ చేయాలని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ అన్నారు. రాష్ట్రంలో విధించిన మద్య నిషేధాన్ని పట్నా హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో, నితీష్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసును విచారించిన సుప్రీంకోర్టు... మద్య నిషేధం విధించడం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారం అని చెబుతూ, హైకోర్టు తీర్పును కొట్టి వేసింది. అయితే, మద్య నిషేధ చట్టంలో ఏ ఇంట్లో అయితే మద్యం కనిపిస్తుందో... ఆ ఇంట్లోని పెద్దలందరినీ జైలుకి పంపిస్తామని ఉంది. దీనిపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పై అంశానికి సంబంధించే పాశ్వాన్ కూడా తన వ్యాఖ్యలు చేశారు. మద్య నిషేధానికి తాను వ్యతిరేకం కాదని... అయితే, అందులోని కొన్ని నిబంధనలనే తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం దొరికితే... రాష్ట్రానికి పెద్ద దిక్కు అయిన ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పారు. ఇంట్లో మద్యం దొరికినప్పుడు ఇంట్లోని పెద్దలను అరెస్ట్ చేసినట్టే ముఖ్యమంత్రిని కూడా అరెస్ట్ చేయాలని అన్నారు. ఇదే సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ పై కూడా పాశ్వాన్ మండిపడ్డారు. అత్యాచారం కేసులో అరెస్ట్ అయి, బెయిల్ పై వచ్చిన ఎమ్మెల్యేకు లాలూ మద్దతు ఇవ్వడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

More Telugu News