: పాక్ ప్రధానికి, సైన్యానికి మధ్య చెడిందా?.. అవునంటున్న ‘డాన్’ పత్రిక

ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, ఆ దేశ ఆర్మీకి మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు తలెత్తినట్టు ఆ దేశానికి చెందిన ‘డాన్’ పత్రిక ప్రత్యేకంగా ఓ వార్తను ప్రచురించింది. ఆ ప్రతిక కథనం ప్రకారం.. ప్రధాని షరీఫ్, సైనికాధికారులు, ప్రజాప్రతినిధులు, ఐఎస్ఐ చీఫ్ రిజ్వాన్ అఖ్తర్‌ల మధ్య ఇటీవల ఉన్నతస్థాయి సమావేశం ఒకటి జరిగింది. ఈ సమావేశంలో తీవ్రస్థాయిలో వాదోపవాదాలు జరిగాయి. జమ్ము కశ్మీర్‌లోని ఉరీ ఘటన తర్వాత అంతర్జాతీయ స్థాయిలో పాక్ ఏకాకిగా మారిందని, జైషే మహ్మద్, హక్కానీ నెట్‌వర్క్‌లపై చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి ఐజాజ్ చౌదరి అన్నారు. ఆయన వ్యాఖ్యలతో వాగ్వాదం మొదలైంది. మంత్రి వ్యాఖ్యలకు ఐఎస్ఐ చీఫ్ కల్పించుకుని గట్టిగా వాదించారు. దీంతో పరిస్థితి ఒక దశలో అదుపు తప్పింది. ఆ సమయంలో ప్రధాని కల్పించుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభుత్వానికి, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తిన విషయాన్ని ఈ ఘటన రుజువు చేస్తోందని ‘డాన్’ పేర్కొంది. ఉరీ ఉగ్రదాడి తర్వాత అన్ని వైపుల నుంచి పాక్ విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. తమ దేశ సైన్యం ఉగ్రవాదులకు అండగా నిలవడం ఆపేయాలని, భారత్‌తో సత్సంబంధాల కోసం ప్రయత్నించాలని అమెరికాలో పాక్ మాజీ రాయబారి హుసేన్ హక్కానీ అన్నారు. దేశ ద్రోహులకు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వడం వల్లే పాక్ అంతర్జాతీయ స్థాయిలో ఒంటరి అయిందని పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ నేత ఆరోపించారు. పాలనలో సైన్యం పాత్రను పరిమితం చేసేందుకు నవాజ్ ప్రయత్నించారని పాక్ సీనియర్ జర్నలిస్టు సలీం సేథీ అభిప్రాయపడ్డారు. కాగా అన్ని వైపుల నుంచి విమర్శల జడివాన కురుస్తుండడంతో స్పందించిన ప్రధాని షరీఫ్ జిహాదీ గ్రూపులపై చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. అంతేకాక పఠాన్ కోట్ ఉగ్రదాడిపై విచారణను పూర్తిచేయాలని, ముంబై దాడుల సూత్రధారి మసూద్ అజర్ కేసును రావల్పిండి కోర్టులో మళ్లీ విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఉగ్రవాదులకు అందిస్తున్న సహకారం నిలిపివేయాల్సిందిగా షరీఫ్ ఐఎస్ఐని ఆదేశించారు. టెర్రరిస్టులకు దూరంగా ఉండాలంటూ సైన్యాన్ని హెచ్చరించారు. దీంతో షరీఫ్‌కు, సైన్యానికి మధ్య విభేదాలు తలెత్తాయని ‘డాన్’ పేర్కొంది.

More Telugu News