: 2018 నాటికి పాక్ సరిహద్దు పూర్తిగా మూసివేస్తాం!: రాజ్ నాథ్ సింగ్

2018 డిసెంబర్ నాటికి భారత్, పాకిస్థాన్ సరిహద్దులను పూర్తిగా సీజ్ చేస్తామని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పష్టం చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జైసల్మేర్ వచ్చిన ఆయన, పాక్ తో సరిహద్దులను పంచుకుంటున్న నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సరిహద్దు భద్రతా దళ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రస్తుతం 200 కిలోమీటర్లకు పైగా ఫెన్సింగ్ లేని సరిహద్దు ఉందని, దాన్ని కూడా మూసేయాలని నిర్ణయించినట్టు ఆయన తెలిపారు. పదే పదే దాడులు చేస్తుంటే, ఎల్లకాలమూ శాంతి మంత్రం పఠిస్తూ ఉంటామని అనుకుంటే పొరపాటేనని హోం మంత్రి పాక్ కు చురకలు అంటించారు. దేశ ప్రజల భద్రతకన్నా ముఖ్యమైన అంశం మరొకటి ఉండదని తెలిపారు. భారత సైన్యంపై తనకు పూర్తి విశ్వాసం, భరోసా ఉన్నాయని అన్నారు. ఈ విషయంలో జాతి మొత్తానికీ, తాను హామీ ఇస్తున్నట్టు చెప్పారు. దేశ రక్షణలో సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉందని రాజ్ నాథ్ వివరించారు.

More Telugu News