: ముంబై కాల్ సెంటర్ గ్యాంగ్ దందా... క్షణాల్లో అమెరికాలో ఇంటి ముందుకు క్యాబ్, నిమిషాల్లో రూ. 1.25 లక్షలు మటాష్!

ముంబై కేంద్రంగా సంచలనం కలిగిస్తున్న కాల్ సెంటర్ స్కామ్ లో మోసపోయిన ఓ ప్రవాస భారతీయుడి కథ ఇది. కాలిఫోర్నియాలో తన కుమారుడితో పాటు ఉంటున్న 75 సంవత్సరాల వినోద్ వాకిల్ తానెలా మోసపోయానన్న విషయాన్ని ముంబై పరిధిలోని థానే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. "మూడు నెలల క్రితం మా ఇంట్లోని ల్యాండ్ లైన్ కు ఓ ఫోన్ వచ్చింది. నేను ప్రభుత్వానికి పన్ను చెల్లించడం లేదని, పోలీసు అధికారులు అరెస్ట్ వారెంట్ తో ఇంటికి వస్తున్నారని చెప్పారు. తనకు జైలు శిక్ష తప్పదని హెచ్చరించారు. దీంతో భయపడ్డ నేను 2 వేల డాలర్లు ఇచ్చాను" అని వినోద్ తెలిపారు. "ఆ సమయంలో ఇంట్లో నేను ఒక్కడినే ఉన్నాను. చిరునామా వివరాలతో పాటు ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? తదితర విషయాలను తెలుసుకుని, నేను ఇండియన్ ను అని గుర్తించి, రాకేష్ పటేల్ అనే ఉద్యోగికి ఫోన్ ఇస్తానని, అతను నన్ను గట్టెక్కిస్తాడని చెప్పారు. తాను ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్ ఉద్యోగినని పరిచయం చేసుకున్న రాకేష్, ఇష్యూను సెటిల్ చేసుకునేందుకు 5 వేల డాలర్లు అడిగారు. ఓ స్టోర్ కు వెళ్లి క్యాష్ కార్డు కొనుగోలు చేసి దానిపై ఉండే 16 అంకెల సంఖ్య, పిన్ చెప్పాలని కోరారు. నేను వయో వృద్ధుడినని చెబితే, వారు ఓ ఎల్లో క్యాబ్ ను ఇంటికి పంపుతున్నామని, వెంటనే క్యాష్ కార్డు కొనాలని చెప్పారు. నిమిషాల్లో ఇంటి ముందుకు ఎల్లో క్యాబ్ వచ్చింది. 5 వేల డాలర్లు లేవని చెప్పిన నేను, ఆపై సమీపంలోని స్టోర్ కు వెళ్లి 2 వేల డాలర్ల (సుమారు రూ. 1.25 లక్షలు) కార్డు కొని దానిపై ఉన్న డిజిటల్ నంబర్ చెప్పాను" అని ఫిర్యాదు చేశారు. ఆపై మళ్లీ ఫోన్ చేసి లాయర్ ఫీజుగా మరో 500 డాలర్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు వచ్చిన తరువాత రేపు కాల్ చేయమని చెప్పానని, ఆ మరుసటి రోజు ఫోన్ రాగా, తన కుమారుడు మాట్లాడి, అది తప్పుడు కాల్ గా గుర్తించాడని తెలిపారు. ఈ విషయమై ఆరంజ్ కౌంటీ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇలాంటివి చాలా ఫిర్యాదులు వస్తున్నట్టు తెలిపారని చెప్పుకొచ్చారు. కాగా, వాకిల్ సహా దాదాపు ఆరుగురు ప్రవాస భారతీయులు ఇప్పటికే థానే పోలీసులకు ఇదే విధమైన ఫిర్యాదులు చేశారు. ఈ కేసును చాలా పెద్ద స్కామ్ గా పరిగణిస్తున్న పోలీసులు ఇప్పటికే 500 మందికి పైగా కాల్ సెంటర్ ఉద్యోగులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న సంగతి తెలిసిందే.

More Telugu News