: తడాఖా చూపుతోన్న ‘తెలంగాణ సైబర్ వారియర్’.. పాకిస్థాన్ కు ముచ్చెమటలు పట్టిస్తోన్న భారత హ్యాకర్లు.. పాక్ ప్రభుత్వ సైట్లపై ఎదురుదాడి

భారత్ కు చెందిన నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లాంటి సైట్లను ఇటీవ‌లే పాకిస్థాన్ హ్యాక‌ర్లు హ్యాక్ చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త సైన్యం పీవోకేలో చేసిన స‌ర్జిక‌ల్ స్ట్రయిక్స్ త‌రువాత భార‌త్‌ను తిప్ప‌లు పెట్టే యోచ‌న‌లో తామేదో గొప్పప‌ని చేస్తున్నామంటూ ఫీలై పోతూ హ్యాక‌ర్లు ప‌లు భార‌త సైట్ల‌లోకి ప్ర‌వేశించి త‌మ దేశ‌భ‌క్తి గేయాల‌ను పోస్టు చేశారు. ప్ర‌పంచానికి సాఫ్ట్‌వేర్ల‌ను స‌ప్లై చేస్తోన్న దేశంగా పేరొందిన భార‌త్ వెబ్‌సైట్‌ల‌పైనే పాక్‌ హ్యాక‌ర్లు ఇటువంటి చ‌ర్య‌కు పాల్ప‌డ‌డంతో భార‌త హ్యాక‌ర్లు వారి హ్యాకింగ్ దాడికి ప్ర‌తిదాడి మొద‌లుపెట్టి పాకిస్థాన్ ప్రభుత్వ నెట్‌వర్క్‌లోకి సమర్థవంతంగా ప్రవేశించేశారు. ఆ దేశ ప్ర‌భుత్వానికి చెందిన కంప్యూట‌ర్లు, డేటాల‌ను లాక్ చేస్తున్నారు. ఇటీవ‌లే యూరీలో పాక్ ఉగ్ర‌వాదుల చ‌ర్యకు మ‌న సైనికులు దిమ్మ‌తిరిగే స‌మాధాన‌మివ్వ‌డంతో పాక్ వెన్నులో వ‌ణుకుపుట్టిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు హ్యాక‌ర్లు చేసిన ప్ర‌తిదాడితో మ‌రోసారి దిక్కుతోచ‌ని స్థితిలో ప‌డింది పాకిస్థాన్. భార‌త హ్యాక‌ర్లు చేసిన ఈ అంత‌ర్జాల దాడిని ఎలా ఎదురించాలో తెలియ‌ని అక్క‌డి సైబర్ నిపుణులు అయోమ‌యంలో ప‌డ్డారు. చివరకు భార‌త హ్యాక‌ర్ల‌ను వేడుకునే స్థితికి వ‌చ్చారు. తమ కంప్యూటర్లను అన్‌లాక్ చేస్తే భారీ మొత్తం ఇస్తామని పేర్కొంటున్నారు. అయితే భారత హ్యాకర్లు వాళ్ల ఆఫర్లను తిర‌స్క‌రిస్తున్నారు. దేశభక్తితోనే ఈ ప‌నిచేసిన భార‌త హ్యాక‌ర్లు పాక్ ఇచ్చే ఆఫ‌ర్లు 'మాకు వ‌ద్దే వ‌ద్దు' అని అంటుండంతో పాక్ ఇరుకున ప‌డింది. పాక్ క‌న‌బ‌రుస్తోన్న ధోర‌ణి ప‌ట్ల‌ భారతీయ హ్యాకర్లకు ఆగ్ర‌హం తెప్పించింది. త‌మ ప‌నిలో ప‌నిగా ఇండియాపై పాక్ చేస్తోన్న‌ దుష్ప్రచారాన్ని కూడా భార‌తీయ హ్యాక‌ర్లు తిప్పికొడుతున్నారు. భార‌త హ్యాక‌ర్ల దెబ్బ‌కి పాక్ ప్రభుత్వ సైట్లేవీ ప‌నిచేయ‌డం లేదు. రాన్సమ్‌వేర్‌ను చొప్పించి పాక్ నెట్‌వర్క్ మొత్తాన్ని స్తంభింప‌జేశారు. 'తెలంగాణ సైబర్ వారియర్' అనే పేరుతో ఉన్న ఒక హ్యాకర్ ఈ ప‌నిచేసిన‌ట్లు తెలుస్తోంది.

More Telugu News