: అప్పుడు జరిగినవి సర్జికల్ దాడులు కావు... కాంగ్రెస్ కు షాకిచ్చిన మాజీ సైనికాధికారి

తమ హయాంలో కూడా సైన్యం సర్జికల్ స్త్రయిక్స్ చేసిందని... కానీ, బీజేపీలా తాము పబ్లిసిటీ కోసం ప్రయత్నించలేదని విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్ నేతలకు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ పాలన సమయంలో అసలు సర్జికల్ దాడులు జరగనే లేదని మాజీ డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ వినోద్ భాటియా బాంబు పేల్చారు. కాంగ్రెస్ హయాంలో జరిగిన దాడులకు, ప్రస్తుత సర్జికల్ దాడులకు అసలు ఎలాంటి పోలికా లేదని ఆయన తేల్చి చెప్పారు. అప్పుడు జరిగినవి కేవలం సరిహద్దుల వెంబడి మామూలు దాడులేనని చెప్పారు. ఇప్పుడు జరిగిన దాడులు పక్కా లక్ష్యంతో చేసినవని, చాలా సున్నితమైనవని భాటియా స్పష్టం చేశారు. ప్రస్తుత దాడుల ద్వారా మన సైనికులు వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించారని తెలిపారు. అప్పటి దాడులకు, ఇప్పటి దాడులకు ఏ మాత్రం పొంతన లేదనే విషయాన్ని మాత్రమే తాను చెబుతున్నానని... దాడులకు సంబంధించిన రాజకీయాల జోలికి తాను వెళ్లనని భాటియా తెలిపారు. ప్రస్తుత దాడుల్లో మన జాతీయ శక్తిలోని ఆర్థిక, దౌత్య, సమాచార యుద్ధతంత్రం... ఇలా ఎన్నో కలసి ఉన్నాయని చెప్పారు. ఉరీ దాడుల తర్వాత మనలోని సహనం చచ్చిపోయిందని... దాని ఫలితమే సర్జికల్ దాడులని అన్నారు. ఎల్ఓసీ అవతల ఉన్న పలు లక్ష్యాల మీద ఏకకాలంలో దాడులు జరిగాయని... ఇలాంటి వ్యూహాన్ని ఇంతవరకు ఎన్నడూ అవలంబించలేదని తెలిపారు. మరోవైపు, 2011 సెప్టెంబర్ 1, 2013 జూలై 28, 2014 జనవరి 14 తేదీలలో తమ హయాంలో ఇలాంటి దాడులే జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలు వాదిస్తున్నారు. ఇప్పుడేదో కొత్తగా తామే చేశామన్నట్టుగా బీజేపీ ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేస్తున్నారు. ఈ క్రమంలో భాటియా వెల్లడించిన విషయాలు కాంగ్రెస్ పార్టీకి శరాఘాతమే అని చెప్పొచ్చు.

More Telugu News