: ఆర్టిస్టుల గురించి కాదు.. ఆర్మీ గురించి ఆలోచించండి.. యాక్షన్ హీరో అక్షయ్ కుమార్

ఉరీ ఉగ్రదాడి తర్వాత బాలీవుడ్‌లోని పాకిస్థాన్ నటులపై నిషేధం విధించాలంటూ వస్తున్న డిమాండ్లు, సర్జికల్ స్ట్రయిక్స్ బూటకమంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలపై బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ స్పందించాడు. ఇప్పుడు ఆలోచించాల్సింది పాకిస్థాన్ నటులు, కళాకారుల గురించి కాదని, సైనికుల గురించి అని పేర్కొన్నాడు. భారత ఆర్మీ మెరుపు దాడులపై ఆధారాలు అడగడాన్ని ఖండించిన అక్షయ్ ఓ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశాడు. తాను ఒక సెలబ్రిటిగా మాట్లాడడం లేదని, ఆర్మీ వ్యక్తి కొడుకుగా మాట్లాడుతున్నానని పేర్కొన్నాడు. ‘‘కొందరు మెరుపు దాడుల వీడియోలు బయటపెట్టాలని డిమాండ్ చేస్తుంటే మరికొందరు పాక్ కళాకారులను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంకొందరేమో యుద్ధం ఎక్కడ జరుగుతుందోనని భయపడుతున్నారు. ఇది చాలా సిగ్గుపడాల్సిన విషయం. దేశం కోసం 19 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. బారాముల్లా ఉగ్రదాడిలో 19 ఏళ్ల నితిన్ యాదవ్ అమరుడయ్యాడు. సినిమాలు ఆడతాయా? లేదా? నటులపై నిషేధం విధిస్తారా? లేదా? అనే ఆలోచన సరికాదు. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది అమరులైన సైనికుల కుటుంబాల గురించి. ఒక్కసారి వారి గురించి ఆలోచించండి. జైహింద్’’ అని వీడియోలో పేర్కొన్నాడు.

More Telugu News