: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మెడకు మరో ఉచ్చు

ఓ ఉగ్రవాది తాజాగా వెల్లడించిన విషయాలను బట్టి చూస్తే... ప్రముఖ ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయక్ మెడకు మరో ఉచ్చు బిగుసుకోబోతోందనే విషయం అర్థమవుతోంది. వివరాల్లోకి వెళ్తే, కేరళలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాద మాడ్యూల్ ను మన్సీద్ అలియాస్ ఒమర్ అల్ హింది నిర్వహిస్తున్నాడు. గత 12 ఏళ్లుగా ఐసిస్ కు కేరళలో ఇన్ఫార్మర్ గా మన్సీద్ వ్యవహరిస్తున్నాడు. ఆర్ఎస్ఎస్ కదలికలపై సైతం ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీ) అధికారులకు మన్సీద్ పట్టుబడ్డాడు. ఎన్ఐఏ విచారణలో మన్సీద్ వెల్లడిస్తున్న విషయాలు తాజాగా సంచలనం రేపుతున్నాయి. మత బోధకుడు జకీర్ నాయక్ ఉపన్యాసాలతోనే యువత ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతోందన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. జకీర్ నాయక్ ఉపన్యాసాలతోనే తాము, ఐఎస్ ప్రేరణ పొందుతున్నామని మన్సీద్ స్పష్టం చేశాడు. అంతేకాదు, ఫ్రాన్స్ లో జరిగిన ఉగ్రదాడి తరహాలోనే కొచ్చిలో కూడా దాడి చేయడానికి తాము కుట్ర పన్నినట్టు వెల్లడించాడు. ప్రజలు ఎక్కువగా ఉన్న చోట వాహనాన్ని వారిపై ఎక్కించి వీలైనంత ఎక్కువ మందిని చంపాలని ప్లాన్ వేసినట్టు అంగీకరించాడు. దీనికోసం ఆరుగురు యువకులను సిద్ధం చేశానని, వారికి రూ. 38 వేలు ఇచ్చానని తెలిపాడు. దాడి చేయడం కోసం ఒక పాత హెవీ వెహికల్ ను కూడా సమకూర్చానని చెప్పాడు. ఆన్ లైన్ ద్వారా యువతను ఆకర్షించి, వారిని ఐఎస్ లో చేరేలా ప్రోత్సహిస్తున్నట్టు అంగీకరించాడు. మన్సీద్ వెల్లడించిన విషయాలతో ఉగ్రవాదంలో జకీర్ నాయక్ పాత్ర ఏంటో మరోసారి అర్థమవుతోంది. గతంలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రదాడికి పాల్పడిన వారిలో ఓ ఉగ్రవాది మాట్లాడుతూ, తనకు జకీర్ నాయక్ ప్రసంగాలే స్ఫూర్తి అని చెప్పడం సంచలనం రేకెత్తించింది. అంతేకాదు, కశ్మీర్ లో భారత సైన్యం హతమార్చిన ఉగ్రవాది బుర్హాన్ వనీ సైతం జకీర్ ను బలపరచాలని పిలుపు ఇచ్చాడు. వీటన్నిటి నేపథ్యంలో, జకీర్ నాయక్ పై విచారణను మరింత వేగవంతం చేసే పనిలో ఎన్ఐఏ ఉన్నట్టు సమాచారం.

More Telugu News