: ‘అసాధారణ మార్పు’... ఉగ్రవాదులపై చర్యలకు నవాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆదేశాలు: పాక్ ప‌త్రిక‌

పాకిస్థాన్‌లో ‘అసాధారణ మార్పు’గా అభివర్ణిస్తూ ఆ దేశ ప‌త్రిక ‘డాన్’ ఓ ఆస‌క్తిక‌ర క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. పాక్‌లోని ఉగ్రవాదుల మీద చర్యలు తీసుకోవాలంటూ ఆ దేశ జ‌వాన్ల‌కు నవాజ్ షరీఫ్ స‌ర్కార్‌ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు పేర్కొంది. జైషే మహమ్మ‌ద్‌తో పాటు ప‌లు ఉగ్రవాద సంస్థలను క‌ట్ట‌డి చేయ‌డానికి పూనుకుంద‌ని తెలిపింది. పాక్‌ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇటీవ‌లే ర‌హ‌స్య స‌మావేశం నిర్వ‌హించార‌ని, అందులో ఈ అంశంపై ఆర్మీకి ఆదేశాలు జారీ చేశార‌ని చెప్పింది. ఉగ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు చేపడితే అందులో ఆ దేశ జ‌వాన్ల ఆధ్వర్యంలోని నిఘా సంస్థలు క‌ల్పించుకోకూడ‌ద‌ని ష‌రీఫ్ చెప్పిన‌ట్లు పాక్ ప‌త్రిక‌ పేర్కొంది. భార‌త్‌లో జ‌రిగిన‌ పఠాన్‌కోట్ సంఘటన విచారణను పూర్తి చేసేందుకు తాము ప్ర‌య‌తిస్తున్న‌ట్లు ఆయ‌న తెలిపినట్టు ప్ర‌చురించింది. ముంబయి దాడులపై విచార‌ణ స్తంభించింద‌ని, అందులో విచార‌ణ మ‌ళ్లీ ప్రారంభించేందుకు కూడా చూస్తున్నామ‌ని సైనికాధికారుల‌కు ష‌రీఫ్ చెప్పిన‌ట్లు పత్రిక పేర్కొంది. తమ ప్ర‌ధాని వ్యాఖ్య‌ల‌పై పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించిన‌ట్లు చెప్పింది. అంతేగాక‌, పాక్‌లోని పంజాబ్ సీఎం షహబాజ్ షరీఫ్‌కి, ఐఎస్ఐ అధికారులకు మధ్య వాగ్వివాదం చెల‌రేగిన‌ట్లు పేర్కొంది. పాక్ ఇక కొత్త విధానాల‌ను పాటించాల‌ని యోచిస్తున్న‌ట్లు డాన్ ప‌త్రిక‌ చెప్పింది. అంతేగాక, తమ దేశానికి చైనా మద్దతును పునరుద్ఘాటించిందని విదేశాంగ శాఖ చెప్పినట్లు పత్రిక పేర్కొంది. అదే సమయంలో ఆ దేశం నుంచి కాలానుగుణంగా తమ ప్రాధాన్యం మారే అవకాశాలు ఉండవచ్చునని సంకేతాలు సైతం వచ్చాయని చెప్పినట్లు వెల్లడించింది.

More Telugu News