: మాయావతి బలప్రదర్శన... ర్యాలీకి 18 రైళ్లు బుక్ చేసిన యూపీ మాజీ ముఖ్యమంత్రి

ఉత్తరప్రదేశ్‌ లో ఎన్నికల హడావుడి పెరుగుతోంది. జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ర్యాలీలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీ యాత్రలు చేస్తున్నాయి. రాష్ట్ర పార్టీలైన సమాజ్ వాదీ, బీఎస్పీ పార్టీలు మాత్రం ఎలాంటి ర్యాలీలు చేపట్టకుండా నెమ్మదిగా ప్రచార వేగం పెంచుకుంటూ వెళ్తున్నాయి. ఈ క్రమంలో బీఎస్పీ ఈనెల 9న పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం వర్ధంతిని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించింది. అందులో భాగంగా రాష్ట్రంలోని 403 నియోజకవర్గాల నుంచి లక్ష మంది కార్యకర్తలతో భారీ ర్యాలీ చేపట్టాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొత్తం 18 రైళ్లను బుక్ చేశారు. ఈ 18 రైళ్లలో 16 రైళ్లను పశ్చిమ యూపీ నుంచి, మరో రెండు రైళ్లను బలియా జిల్లా నుంచి నడపనున్నారు. ప్రతి రైలులో 5 వేల మంది వాలంటీర్లు ఈ నెల 8న లక్నో చేరుకోనున్నారు. అంతేకాకుండా నియోజకవర్గాల నుంచి పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్న ఆశావహులు బస్సుల్లో కార్యకర్తలను తీసుకుని ఈ కార్యక్రమానికి హాజరుకావాలని ఆదేశించారు. 9వ తేదీన నిర్వహించనున్న ర్యాలీలో సుమారు 20 లక్షల మంది కార్యకర్తలను సమీకరించాలన్నది పార్టీ లక్ష్యమని పార్టీ నేత ఒకరు చెప్పారు. తద్వారా పార్టీ బలాన్ని ఇతర పార్టీలకు చాటాలన్నది మాయావతి వ్యూహమని ఆయన వెల్లడించారు. ఇందులో పాల్గొనేందుకు చాలా మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారని, వారికి ప్రయాణ సౌకర్యాలు సమకూర్చడం తమ వల్ల కావడం లేదని ఆయన అన్నారు. కాగా, మాయావతి ప్రచారంలో భాగంగా ఇప్పటికే ఆగ్రా, ఆజాంగఢ్, సహారన్‌ పూర్, అలహాబాద్ ప్రాంతాల్లోని 220 నియోజకవర్గాలను చుట్టేయడం ద్వారా, ర్యాలీలు నిర్వహించి ఆకట్టుకున్నారు. ప్రధానంగా ఆమె దళితులు, ముస్లింలు, బ్రాహ్మణుల ఓటు బ్యాంకుపై కన్నేశారని పరిశీలకులు చెబుతున్నారు. అదే సమయంలో మిగిలిన వర్గాలను నిర్లక్ష్యం చేయకూడదన్నది మాయావతి ఉద్దేశ్యమని వారు చెబుతున్నారు.

More Telugu News