: పురచ్చితలైవి 'అవుట్ ఆఫ్ డేంజర్'... ఎయిమ్స్ నుంచి నలుగురు వైద్యుల రాక

అస్వస్థతతో అపోలో ఆసుపత్రిలో గత పది రోజులుగా చికిత్స పొందుతున్న అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి పురచ్చితలైవి జయలలితకు చికిత్స చేసేందుకు ఎయిమ్స్‌ నుంచి నలుగురు వైద్య నిపుణులు చెన్నై చేరుకున్నారు. ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ నాయక్‌, పల్మనాలజీ నిపుణుడు కిర్మాణీ, అనెస్థటిక్‌ ఇంటెన్సివిస్ట్‌ డాక్టర్‌ అంజన్‌ ఈ వైద్య బృందంలో వున్నారు. ఇక ఇటీవలే చెన్నయ్ వచ్చి ఆమెకు చికిత్స నిర్వహించిన లండన్‌ వైద్యుడు డాక్టర్‌ రిచర్డ్‌ బీలే కూడా నేడు మరోసారి వస్తున్నారు. వీరందరూ కలసి ఆమెకు అందించవలసిన చికిత్సపై దిశానిర్దేశం చేస్తారు. ప్రస్తుతానికి జయలలితకు ప్రాణాపాయం తప్పిందని, మరో రెండు వారాల చికత్స అనంతరం ఆమెను ఇంటికి పంపిస్తారని తెలుస్తోంది. ఆమె ఊపిరితిత్తులకు సోకిన ‘ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్’ తగ్గుముఖం పట్టిందని తెలుస్తోంది. కాగా, ఆమె వద్దకు అతికొద్ది మందికి మాత్రమే అనుమతి లభిస్తోంది. ఆమె మిత్రురాలు శశికళ, ఆమె మరదలు ఇళవరసి, శశికళ తమ్ముడు ఎంగిర దివాకరన్ లు జయలలిత బాగోగులు చూసుకుంటున్నట్లు సమాచారం. కాగా, యాంటీ బయోటిక్స్ వాడుతున్న జయలలిత భారీ ఎత్తున బరువుతగ్గే అవకాశం ఉందని, డిశ్చార్జ్ అనంతరం రెండు నెలల పాటు విశ్రాంతి అవసరమని తెలుస్తోంది.

More Telugu News