: మార్కెట్ అప్ డేట్... లాభాలు నష్టాలైన వేళ!

సెషన్ ఆరంభంలోని లాభాలు సమయం గడిచే కొద్దీ నష్టాలుగా మారడంతో భారత స్టాక్ మార్కెట్ ఒత్తిడిలో కూరుకుపోయింది. పెద్ద పెద్ద కంపెనీల ఈక్విటీలను విక్రయించి లాభాలను స్వీకరించేందుకు ఆసక్తి చూపిన ఇన్వెస్టర్లు చిన్న కంపెనీల వాటాలను కొనేందుకు ఉత్సాహం చూపించడం గమనార్హం. దీంతో మార్కెట్ బెంచ్ మార్క్ ఇండెక్స్ లు నష్టపోయినప్పటికీ, లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ రూ. 11 వేల కోట్లు పెరిగింది. బుధవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 113.57 పాయింట్లు పడిపోయి, 0.40 శాతం నష్టంతో 28,220.98 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 25.20 పాయింట్లు పడిపోయి 0.29 శాతం నష్టంతో 8,743.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.50 శాతం, స్మాల్ కాప్ 0.62 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 17 కంపెనీలు లాభపడ్డాయి. టాటా మోటార్స్, బీపీసీఎల్, అల్ట్రా సిమెంట్స్, ఐచర్ మోటార్స్, హిందాల్కో తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఐడియా సెల్యులార్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఆటో తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 3,004 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,745 కంపెనీలు లాభాలను, 1,135 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. బీఎస్ఈలో మంగళవారం నాడు రూ. 1,13,57,485 కోట్లుగా ఉన్న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ నేడు రూ. 1,13,68,363 కోట్లకు పెరిగింది.

More Telugu News