: కేవలం 20 నిమిషాల్లో.. నెల్లూరు నుంచి గుంటూరుకు గుండె తరలింపు!

నెల్లూరులో బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి గుండెను కేవలం 20 నిమిషాల్లో గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు.. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం కరేడు గ్రామానికి చెందిన సుబ్బారెడ్డి నెల్లూరు జిల్లాలోని ఇంగూరుపేట గ్రామంలోని మద్యం దుకాణంలో పని చేస్తుంటాడు. ఆదివారం రాత్రి రంగపట్నంలోని బంధువు ఇంటికి బైక్ పై వెళ్తుండగా అదుపుతప్పి ముళ్ల పొదల్లో పడిపోయాడు. దీంతో ఆయన్ని నెల్లూరు నారాయణ ఆసుపత్రికి తరలించారు. నిన్న రాత్రి ఆయన బ్రెయిన్ డెడ్ కు గురైనట్టు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో సుబ్బారెడ్డి భార్య శివకుమారి, వారి బంధువుల అంగీకారంతో ఆయన అవయవాలను దానం చేసేందుకు ఏర్పాటు చేశారు. దీంతో నెల్లూరు నారాయణ ఆసుపత్రి నుంచి సుబ్బారెడ్డి గుండెను గుంటూరు సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)కి తరలించే నిమిత్తం కొత్తపట్నం పోర్టు సీఆర్వో వేణుగోపాల్ హెలికాప్టర్ ఏర్పాటు చేశారు. దీంతో, ఈరోజు సాయంత్రం కేవలం 20 నిమిషాల్లో గుండెను గుంటూరుకు తరలించారు. కర్నూల్ కు చెందిన హీరామతి బాయికి ఈ గుండెను అమర్చనున్నారు. కాగా, సుబ్బారెడ్డి ఇతర అవయవాలు కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కళ్లను కూడా వరుసగా విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి, చెన్నైలోని ఫోర్సిస్ ఆసుపత్రికి, ఒక మూత్రపిండాన్ని తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి, కళ్లను మోడరన్ ఐ ఆసుపత్రికి తరలించారు. సుబ్బారెడ్డి మూత్రపిండాల్లో మరొక దానిని నారాయణ ఆసుపత్రిలోని వ్యక్తి కోసం ఉంచినట్లు ఆసుపత్రి సీఈవో తెలిపారు. కాగా, తన భర్త కోరిక మేరకు ఆయన అవయవాలను ఇతరులకు దానం చేశామని శివకుమారి పేర్కొంది. అయితే, తన భర్త మృతితో తాను సర్వస్వం కోల్పోయానని, ఇద్దరు పిల్లలు ఉన్నారని తనకు ప్రభుత్వం ఆర్థిక సాయమందించాలని, జీవనోపాధి కల్పించాలని కోరింది.

More Telugu News