: ఆర్మీపై చేసిన వ్యాఖ్యల ఫలితం... ఓంపురిపై కేసు నమోదు

భారతదేశంలో అత్యంత ప్రతిభావంతమైన నటుల్లో ఒకరైన ఓంపురిపై ముంబైలోని పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. భారత్ లో పాకిస్థాన్ కళాకారులు పని చేయడాన్ని బలంగా సమర్ధించిన ఓం పురి సైనికులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ అంధేరీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తన తండ్రి సైన్యంలో పని చేశారని చెప్పిన ఓం పురి, సైనికులంటే తనకు విపరీతమైన ఆపేక్ష ఉందని అన్నారు. అలాగని యువకులను సైన్యంలో చేరండి, ఆయుధాలు పట్టుకోండి అని చెప్పలేదు కదా? అని ఆయన అన్నారు. భారత్-పాకిస్థాన్ ను ఇజ్రాయెల్-పాలస్తీనాలా చేయాలని భావిస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరికైనా చేతనైతే ప్రధాని మోదీ వద్దకు వెళ్లి పాకిస్థాన్ నుంచి వచ్చి పని చేసుకుంటున్న కళాకారుల వీసాలను రద్దు చేయమని చెప్పండి, అంతే కానీ వాళ్లు ఏం పాపం చేశారని అడిగిన వారిని దేశద్రోహులుగా చిత్రీకరించవద్దని సూచించారు. ఇంకా చేతనైతే 15, 20 మంది ఆత్మాహుతి బాంబర్లను తయారు చేసి, పాకిస్థాన్ పైకి పంపాలని సవాల్ విసిరారు. ఇలా అడిగింది ఖాన్ లా? లేక ఇంకొకరా? అన్నది అనవసరమని ఆయన అన్నారు. దీంతో ఆయనపై ముంబైలోని అంధేరీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

More Telugu News