: భారత్ చెప్పుకుంటున్న సర్జికల్ దాడులు అవాస్తవమేమో!: ఐరాస అనుమానం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి భారత సైన్యం చొచ్చుకుపోయి ఏకంగా 38 మంది ఉగ్రవాదులను హతమార్చి క్షేమంగా తిరిగి రావడం అంతా కట్టు కథేనా? ఐరాస వ్యక్తపరుస్తున్న సందేహాలను నిశితంగా పరిశీలిస్తే, పలు అనుమానాలు కలుగుతున్నాయి. సరిహద్దుల్లో భద్రతను పర్యవేక్షించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సైనిక బృందాన్ని (యూఎన్ఎంజీఐపీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ బృందానికి వచ్చిన అనుమానాలు ఏంటంటే... ఏకంగా 38 మంది ఉగ్రవాదులు మరణిస్తే, మిగతా ఉగ్ర బృందాల్లో ఎడతెగని చర్చ జరుగుతుంది. వీరు సంభాషణలను, సందేశాలను ఇచ్చి పుచ్చుకున్నట్టు ఇంతవరకూ దాఖలాలు లేవు. వారు చర్చలు జరపకుండా ఐఎస్ఐ నిలువరించి వుండవచ్చని, లేకుంటే ఒకరిద్దరు ఉగ్రవాదుల్ని చంపి భారత్ ఆ సంఖ్యను పెంచి చెప్పుండాలని అనుమానించింది. ఇక 38 మంది మృతదేహాలు, వాటి అంత్యక్రియల విషయం ఎంత దాచాలన్నా దాగే అంశం కాదు. వీటిని తరలించడం సమీప గ్రామాల్లోని ప్రజల కంటపడే తీరుతుందన్నది మరో వాదన. ఇక భారత్ నిజంగా సర్జికల్ దాడులు జరిపివుంటే, అందుకు సంబంధించిన సాక్ష్యాలతో కూడిన వీడియో ఫుటేజ్ ని వెంటనే విడుదల చేయాలని సామాజిక మాధ్యమాల్లో డిమాండ్ పెరుగుతోంది. వాస్తవానికి కార్గిల్ లోకి పాక్ సైనికులు చొచ్చుకు వచ్చిన వేళ, తొలుత ఆ దేశం తామాపని చేయలేదని బుకాయించింది. ఆ సమయంలో పాక్ జనరల్ గా ఉన్న ముషారఫ్, అప్పటి పాక్ సైన్యం ప్రధానాధికారి మొహమ్మద్ అజీజ్ మధ్య సంభాషణను ట్రాప్ చేసిన భారత 'రా' అధికారులు దాన్ని బహిర్గతం చేసి పాక్ కుట్రను ప్రపంచానికి చూపారు. ఇప్పుడు కూడా తమ దేశంపై దాడి జరగలేదని పదే పదే చెబుతున్న పాక్ కు అంతర్జాతీయ దేశాల నుంచి మద్దతు పెరగక ముందే, ఆ దేశాన్ని మరింత ఏకాకిని చేయాలంటే సర్జికల్ స్ట్రయిక్స్ కు సంబంధించిన ఫుటేజ్ ని వెంటనే బయటపెట్టాల్సి వుంది. సాక్ష్యాలు బయట పెట్టడంలో మరింత ఆలస్యం అయ్యే కొద్దీ అది ఇండియాకే నష్టమని రాజకీయ నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు.

More Telugu News