: పాకిస్థాన్ లో ప్రజాస్వామ్యమా?... లాభం లేదన్న పర్వేజ్ ముషారఫ్

తన దేశంలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లే అవకాశం లేదని పాక్ మాజీ అధ్యక్షుడు, మాజీ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ వ్యాఖ్యానించారు. ఓ సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, "ప్రజాస్వామ్య వ్యవస్థ పాకిస్థాన్ కు సరిపడదు. వ్యవస్థలో సమతుల్యం, పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణం. ఈ తరహా తప్పులు పెరిగిన సమయంలో సైన్యం కల్పించుకోవాల్సిందే. పాక్ ప్రజలు సైతం ఇదే కోరుకుంటుంటారు" అని ముషారఫ్ వ్యాఖ్యానించిట్టు 'ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్' పేర్కొంది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పాలనను మార్చుకోవడంలో ప్రభుత్వాలు విఫలం కావడం పాకిస్థాన్ లో సర్వసాధారణమేనని ఆయన అన్నారు. ఇక పాక్ లో ప్రజాస్వామ్యం పరిస్థితేంటని ప్రశ్నించగా, ప్రభుత్వం వల్లకాకుంటే, ఏ క్షణమైనా సైన్యం రంగంలోకి దిగుతుందని, రాజకీయాలకు అతీతంగా సైన్యం తన పని తాను చేసుకుపోతుందని, గతంలోనూ ఇలాగే జరిగిందని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాక్ లో సైన్యానిదే ప్రధాన పాత్రని చెప్పుకొచ్చారు. తన స్వీయ ప్రయోజనాల కోసం తమ దేశాన్ని అమెరికా వాడుకుందని ఆరోపించారు. 2011 సంవత్సరంలో అల్ ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ ఎన్ కౌంటర్ విషయంలో తనకింకా అనుమానాలున్నాయని ముషారఫ్ పేర్కొన్నారు.

More Telugu News