: భారత ఆర్థిక వ్యవస్థపై పాక్ టెన్షన్ తో ప్రభావం నామమాత్రమే!: అరుణ్ జైట్లీ

ఇటీవలి కాలంలో ఇండియా, పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం నామమాత్రమేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, ఇండియా జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ చూపే ప్రభావం అత్యంత స్వల్పమని ప్రస్తుతం కెనడాలో పర్యటిస్తున్న జైట్లీ తెలిపారు. యూనివర్శిటీ ఆఫ్ టొరంటోలో భాగమైన రోట్ మాన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ లో ఆయన ప్రసంగిస్తూ, స్టాక్ మార్కెట్లు, రూపాయి విలువలో కనిపిస్తున్న మార్పులు తాత్కాలికమేనని అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ఇండియాలోకి విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయని గుర్తు చేశారు. "ఇటీవల పాక్ ఉగ్రస్థావరాలపై సైన్యం జరిపిన సర్జికల్ స్ట్రయిక్స్ తరువాత మార్కెట్లు కొంత అనిశ్చితిలోకి వెళ్లాయి. ఈ పరిస్థితి కూడా వెంటనే సర్దుకుంది" అని జైట్లీ వ్యాఖ్యానించారు.

More Telugu News