: చనిపోయిన 12 ఏళ్ల తర్వాత ఇంటర్వ్యూ కాల్.. ఉద్యోగం కల తీరకుండానే కన్నుమూసిన కరుణాకర్

ప్రభుత్వ ఉద్యోగం యువత కల. సర్కారు కొలువు సాధించాలని కష్టపడి చదివి పరీక్ష రాసిన ఓ అభ్యర్థిని అధికారులు ఇంటర్వ్యూకు పిలిచారు. కానీ 12 సంవత్సరాలు ఆలస్యంగా! ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండల కేంద్రానికి చెందిన వంగల కరుణాకర్ స్వామి 1999లో వెలువడిన గ్రూప్-2 పరీక్షలకు దరఖాస్తు చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో జరిగిన పరీక్షకు హాజరయ్యాడు. తాను చాలా బాగా పరీక్ష రాశానని, ఉద్యోగం ఖాయమని నమ్మిన కరుణాకర్‌కు ఫలితాలు నిరాశపరిచాయి. ఆ పరీక్షల్లో ఆంత్రోపాలజీ, సోషియాలజీని అతడు ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకోగా తెలుగు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రధాన సబ్జెక్టులుగా ఎంచుకున్న అభ్యర్థులే ఎక్కువగా ఎంపికయ్యారు. కరుణాకర్ ఆంత్రోపాలజీలో 150 మార్కులకు గాను 112 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో ప్రథమస్థానంలో నిలిచాడు. ఫలితాలు ఏకపక్షంగా ఉండడంతో మరో 54 మంది అభ్యర్థులతో కలిసి కరుణాకర్ కోర్టుకెక్కాడు. ఆ తర్వాత సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించాడు. ఈ క్రమంలో జూన్ 16, 2004లో కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లి వస్తుండగా వరంగల్ జిల్లా సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కరుణాకర్, ఆయన తల్లిదండ్రులు, సోదరి మృత్యువాత పడ్డారు. కాగా సుప్రీంకోర్టులో కరుణాకర్ వేసిన కేసులో వివాదం ఓ కొలిక్కి వచ్చింది. కోర్టును ఆశ్రయించిన ఆ 54 మంది ఉద్యోగాలకు అర్హులేనంటూ తీర్పు చెప్పింది. వెంటనే ఇంటర్వ్యూలకు పిలిచి ఉద్యోగాలు ఇవ్వాలంటూ ఆదేశించింది. ఆ జాబితాలో కరుణాకర్ పేరు కూడా ఉంది. దీంతో ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరుకావాల్సిందిగా కోరుతూ కరుణాకర్‌కు అధికారులు ఇంటర్వ్యూ కాల్ పంపించారు. కానీ దురదృష్టవశాత్తు ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరకుండానే కరుణాకర్ కన్నుమూశాడంటూ ఆయన సోదరుడు కృపాకర్, స్నేహితులు ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News