: గంభీర్ పునఃప్రవేశం ఖాయం... ధావన్ అవుట్...గంభీర్ ఇన్!

టీమిండియాలో గౌతం గంభీర్ పునఃప్రవేశం ఖరారు అయింది. గంభీర్ హోం గ్రౌండ్ గా భావించే ఈడెన్ గార్డెన్ లో టెస్టు ద్వారా గంభీర్ పునఃప్రవేశం జరుగుతుందని అంతా భావించారు. అయినప్పటికీ కెప్టెన్ కోహ్లీ, కోచ్ కుంబ్లే ఓపెనర్ శిఖర్ ధావన్ వైపే మొగ్గు చూపారు. దీంతో ఈడెన్ లో ప్రతిష్ఠాత్మక 500వ మ్యాచ్ కు గంభీర్ ఆడలేకపోయాడు. కాగా, రెండో టెస్టులో శిఖర్ ధావన్ గాయపడ్డాడు. ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి ధావన్ వేలికి గాయం చేసింది. దీంతో వైద్యులు విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో మూడో టెస్టుకు ధావన్ దూరమయ్యాడు. తొలి టెస్టులో కేఎల్ రాహుల్ గాయపడగా, రెండో టెస్టులో ధావన్ గాయపడ్డాడు. వీరిద్దరి గాయాలు గంభీర్ కు స్థానం కల్పించాయి. దీంతో మూడో టెస్టులో టీమిండియా ఓపెనర్ గా గంభీర్ ఆడనున్నాడు. ఈ నెల 8 నుంచి ఇండోర్ లో మూడో టెస్టు ప్రారంభం కానుంది. మూడు టెస్టుల సిరీస్ లో రెండు విజయాలతో టీమిండియా సిరీస్ ను సొంతం చేసుకున్నప్పటికీ ఆ టెస్టును కూడా గెలిచి క్లీన్ స్వీప్ సాధించవచ్చని భావిస్తోంది. ఈ నేపథ్యంలో గౌతీ కుదురుకుంటే ఇంకొంత కాలం జట్టులో కొనసాగే అవకాశం ఉంది. కాగా రెండేళ్ల విరామం తరువాత గౌతీ జట్టులోకి రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

More Telugu News