: న్యూజిలాండ్ కు మళ్లీ పరాభవం...ఈడెన్ పోరులో భారత్ విజయం!

పర్యాటక న్యూజిలాండ్ కు భారత పిచ్ లు పెను సవాళ్లు విసురుతున్నాయి. కాన్పూర్ టెస్టును సునాయాసంగా గెలుచుకున్న టీమిండియా, రెండో టెస్టును కూడా అదే తరహాలో గెలుచుకుంది. వాస్తవానికి రెండు టెస్టులను న్యూజిలాండ్ జట్టు ఘనంగా ప్రారంభించింది. బ్యాటింగ్, బౌలింగ్ లో గట్టి పోటీ ఇచ్చింది. అయితే ప్రపంచ స్థాయి జట్టుపై కివీస్ ప్రదర్శన స్థాయికి తగ్గట్టులేదు. దీంతో కివీస్ కు చేదు అనుభవం ఎందురైంది. తొలి టెస్టులో అశ్విన్ జడేజాలు భారత్ కు విజయాన్ని కట్టబెడితే, రెండో టెస్టును భువనేశ్వర్ కుమార్, షమీ భారత్ కు విజయాన్ని బహుమతిగా అందజేశారు. వీరిద్దరూ స్వింగ్ బౌలింగ్ తో న్యూజిలాండ్ ఆటగాళ్లను ముప్పుతిప్పలు పెట్టారు. దీంతో లాంథమ్ (74), గుప్తిల్ (24), నికోలాస్ (24), రోంచీ (32), హెన్రీ (18) ఆకట్టుకున్నప్పటికీ టీమిండియాను ఓడించే ఆటతీరు ప్రదర్శించలేకపోయారు. ఇదే సమయంలో భారత బౌలర్లు కివీస్ బ్యాట్స్ మన్ పై పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శించారు. దీంతో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 316 పరుగులు చేయగా, సమాధానంగా న్యూజిలాండ్ 204 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 263 పరుగులు చేయగా, కివీస్ కేవలం 197 పరుగులే చేయగలిగింది. దీంతో టీమిండియా వరుసగా రెండో టెస్టును కూడా గెల్చుకుంది. టీమిండియా బౌలర్లలో భువనేశ్వర్ (6), షమి (5), అశ్విన్ (4), జడేజా (4) వికెట్లతో రాణించారు. దీంతో న్యూజిలాండ్ కు రెండో టెస్టులో కూడా పరాభవమే ఎదురైంది. భారతీయ ఆటగాళ్లు ఈడెన్ ను మళ్లీ ఏలారు. దీంతో 179 పరుగుల తేడాతో టీమిండియా రెండో టెస్టును గెలుచుకుంది.

More Telugu News