: నన్ను తిట్టడం కాదు...ఏం జరిగిందో ఓ సారి ఆలోచించండి: పాకిస్థానీలకు అద్నాన్ సమీ సూచన

'ఇండియన్ ఆర్మీ కమాండర్లు మంచి పని చేశారు' అంటూ పాకిస్థాన్ లో సర్జికల్ స్ట్రయిక్స్ చేపట్టిన వెంటనే ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు అద్నాన్ సమీ స్పందించాడు. దీంతో యావద్భారతావని అతనిని ప్రశంసల్లో ముంచెత్తగా, పాకిస్థానీలు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. అతనిని దేశ ద్రోహి అంటూ, 'పాక్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ పైలట్ కొడుకు సిగ్గులేని పని చేశాడంటూ' మండిపడుతున్నారు. దీంతో అద్నాన్ సమీ మరోసారి స్పందించాడు. పాకిస్థానీలంతా తాను చేసిన కామెంట్లపై మండిపడుతున్నారని వాపోయాడు. అయితే తనను విమర్శిస్తున్న వారంతా ఉగ్రవాదం, పాకిస్థాన్ రెండూ ఒకటే అని భావిస్తున్నట్టుంది అంటూ వ్యంగ్యాస్త్రం సంధించాడు. తాను అన్న మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాల్సిందిగా కోరాడు. అదే సమయంలో ‘‘ఆ దాడులు ఇండియన్ ఆర్మీ ఎందుకు చేసింది? ఎవరిపై చేసింది? అన్నవి ఆలోచించాల్సిన అవసరముంది. పాక్ ను ఆక్రమించుకునేందుకు చేసిన దాడులు కాదు. ఉగ్రదాడులు జరగకుండా నిరోధించడం కోసం చేసిన దాడులు మాత్రమే. ఉగ్రవాద క్యాంపులపైనే భారత ఆర్మీ దాడి చేసింది’’ అని స్పష్టం చేశాడు. 9/11 దాడులు, ముంబై తాజ్ అటాక్, పారిస్‌ లో కాల్పులు.. ఇలా అంతా ఎదుర్కొంటున్న సమస్య ఉగ్రవాదమని స్పష్టం చేశాడు. పెషావర్‌ స్కూల్ విద్యార్థులను దారుణంగా కాల్చి చంపినప్పుడు యావత్ప్రపంచం బాధపడిందని గుర్తుచేశాడు. దీనికి ఒక ఉదాహరణ చెబుతానంటూ మొదలుపెట్టిన సమీ ‘‘మా పొరుగు ఇంటి నుంచి వ్యర్థాలన్నీ మా ఇంట్లోకి వస్తున్నాయనుకుందాం. ఏదైనా చేయండి అని వారికి నేను చెబుతాను. కానీ, అతడు మాత్రం స్పందించడు. దాని వల్ల తానూ సమస్య ఎదుర్కొంటున్నానని, ఏం చేయలేనని చెప్పాడు. ఇక, ఆ చెత్త వల్ల నా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలవుతున్నారు. మరి అప్పుడు నేను ఏం చేయాలి? ఆ చెత్తనంతా ఏరిపారేయాలి. అవునా? కాదా?.. నేను ఆ చెత్తను క్లీన్ చేస్తే... చెత్తను క్లీన్ చేసేశాడని పొరుగింటి వ్యక్తి ఏడవకూడదు కదా? కానీ, ఇప్పుడేం జరుగుతోంది? ఆ పొరుగు వ్యక్తి నాపై ఫిర్యాదు చేసి గొడవ పెట్టుకుంటున్నాడు కదా?’’ అంటూ భారత్-పాక్‌ల మధ్య ఏర్పడిన యుద్ధవాతావరణాన్ని వివరించాడు.

More Telugu News