: హైద‌రాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని.. అప్పుడే కార్యాల‌యాల‌ త‌ర‌లింపులు ఎందుకు?: అంబ‌టి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌చివాల‌యాన్ని హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లించడం ప‌ట్ల ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబు ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ప‌దేళ్లు హైద‌రాబాద్‌లో ఉండే అవ‌కాశం ఉందని ఆయ‌న అన్నారు. స‌చివాల‌య త‌ర‌లింపున‌కు తాము వ్య‌తిరేకం కాదని, అర‌కొర వ‌సతులతో త‌ర‌లింపులు వ‌ద్దని ఆయ‌న అన్నారు. హైద‌రాబాద్ 10 ఏళ్ల పాటు ఉమ్మ‌డి రాజ‌ధాని.. కార్యాల‌యాల‌ త‌ర‌లింపులు ఎందుకు? అని అంబ‌టి ప్ర‌శ్నించారు. ఈ కాల‌వ్య‌వ‌ధిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవ‌చ్చని సూచించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడి ప్ర‌భుత్వం తాము చేస్తోన్న‌ అవినీతి అక్ర‌మాల‌పై ముసుగు వేసేందుకే ఈ చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని అంబ‌టి ఆరోపించారు. చంద్ర‌బాబు నిరంకుశంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, మ‌నం ప్ర‌జాస్వామ్యంలో ఉన్నామా? అన్న అనుమానం క‌లుగుతోందని ఆయ‌న అన్నారు. ఓటుకు నోటు కేసు భ‌యంతోనే స‌చివాల‌యం త‌ర‌లింపు అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వాన్ని ప్రశ్నిస్తోన్న నేత‌ల‌పై పీడీయాక్ట్ ప్ర‌యోగిస్తామంటూ చంద్ర‌బాబు బెదిరిస్తున్నారని ఆయ‌న ఆరోపించారు. ప్ర‌తిప‌క్షాల‌ను అణ‌చివేసే ప్ర‌య‌త్నం చేస్తున్నారని మండిప‌డ్డారు. ఇటువంటి ప్ర‌య‌త్నాలే కొన‌సాగిస్తే ప్ర‌జ‌లు త‌రిమికొట్టే రోజులు వ‌స్తాయ‌ని అన్నారు. హైద‌రాబాద్ నుంచి పాల‌న కొన‌సాగితే ఏదైనా నేరం జ‌రిగిన‌ప్పుడు తెలంగాణ ప‌రిధిలో విచార‌ణ సాగుతుందని భ‌య‌ప‌డే ప్ర‌భుత్వం అమ‌రావ‌తికి కార్యాల‌యాల‌ను త‌ర‌లిస్తోంద‌ని ఆయ‌న ఆరోపించారు.

More Telugu News