: నా దృష్టిలో అవి సినిమాలే కావు.. వాడు రాముడా, రావణుడా? అన్నది అప్పుడు తెలుస్తుంది.. ప్రకాశ్‌రాజ్

రామాయణం ఓ గాధ కాదని, అది భారతీయ జీవితమని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు రాముడిలా ఉండడానికి ప్రయత్నిస్తారని, అది సాధ్యం కాకపోతే కనీసం నటిస్తారని ఆయన పేర్కొన్నారు. అయితే అతడు రాముడా? రావణుడా? హనుమంతుడా? అనేది ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు మాత్రమే బయటపడుతుందని అన్నారు. ప్రకాశ్ రాజ్ దర్శకుడిగా తెరకెక్కించిన ‘మన ఊరి రామాయణం’ త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. తన దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘ధోని’, ‘ఉలవచారు బిర్యానీ’ వంటి సినిమాలు తన దృష్టిలో సినిమాలు కాదని, తనలోని ప్రసవ వేదన అని పేర్కొన్నారు. ఓ సినిమా ఆడేందుకు, పోవడానికి మధ్య చాలా కారణాలు ఉంటాయన్నారు. తనకు తెలిసినంత వరకు తాను ఇప్పటి వరకు మొదటి సినిమా తీయలేదన్నారు. తనలోని దర్శకుడు వేరు, నటుడు వేరు అని చెప్పుకొచ్చిన ప్రకాశ్ రాజ్ దర్శకుడిగా తాను రాసుకునే పాత్రలకు ఎవరు నప్పుతారో వారినే తీసుకుంటానని, 'మన ఊరి రామాయణం'లో ఓ పాత్రకు ప్రకాశ్‌‌రాజ్ కంటే గొప్ప నటుడు తనకు కనిపించలేదని, అందుకే వాడిని తీసుకున్నానని చెప్పుకొచ్చారు. దక్షిణాదిలో అత్యధిక పారితోషికం తీసుకుంటున్నట్టు వస్తున్న వార్తలపై స్పందించిన ప్రకాశ్ రాజ్ తానేమీ ఎక్కువ తీసుకోవడం లేదని, తనకు ఎంతివ్వాలో అంతే ఇస్తున్నారని అన్నారు. ఇంకా చెప్పాలంటే తక్కువే ఇస్తున్నారని పేర్కొన్నారు. అయితే కోటి రూపాయలు ఇచ్చే పాత్ర కంటే రూపాయి కూడా రాని దర్శకత్వం వల్లే తనకు ఎక్కువ సంతృప్తి లభిస్తుందని తెలిపారు. డబ్బుకంటే చవకైన వస్తువును తన జీవితంలోనే చూడలేదని, దానికి తానెప్పుడూ విలువ ఇవ్వనని వివరించారు. తాను దత్తత తీసుకున్న కొండారెడ్డి పల్లె గురించి మాట్లాడుతూ తానీ స్థాయిలో ఉన్నప్పుడు చేతనైనంత సాయం చేయాలనే ఆ పని చేస్తున్నానన్నారు. చెక్కులు రాసిచ్చి చేతులు దులుపుకోవడం కాకుండా వాళ్లతో కలిసి పనిచేస్తూ ఆ గ్రామాన్ని దత్తత తీసుకోడం తనకు ఎనలేని సంతృప్తిని ఇచ్చిందని ప్రకాశ్‌రాజ్ వివరించారు.

More Telugu News