: కొత్త జిల్లాలు 17 కాదు 20.. తెరపైకి గద్వాల, సిరిసిల్ల, జనగామ!

ఇప్పటి వరకు కొత్త జిల్లాలు 17 మాత్రమే అంటూ వచ్చిన వార్తలకు ఇప్పుడు మరో 3 జిల్లాలు కలిశాయి. అవి గద్వాల, సిరిసిల్ల, జనగామ. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలకు తోడు కొత్తగా మరో 17 జిల్లాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ఆగస్టు 22న ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దసరా నాటికి కొత్త జిల్లాలను ప్రకటించాలని యోచిస్తున్న ప్రభుత్వం అదే లక్ష్యంతో పనిచేస్తోంది. ఇందుకు మరి కొన్ని రోజులే గడువు ఉన్న సమయంలో తాజాగా మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల, కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల, వరంగల్ జిల్లాలోని జనగామలు అనూహ్యంగా తెరపైకి వచ్చాయి. ఈ మూడింటిని జిల్లాలుగా ఏర్పాటు చేయాలంటూ చాలారోజులుగా ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. గద్వాల జిల్లా కోసం రాజీనామా కూడా చేస్తానని మాజీ మంత్రి అరుణ ప్రకటించారు కూడా. ఇక సిరిసిల్ల నుంచి ముఖ్యమంత్రి తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తుండడం, జనగామలో మెజారిటీ ప్రజలు జిల్లా కావాలని కోరుకుంటుండడంపై ఈ మూడింటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం భావించినట్టు సమాచారం. ఇదివరకు ప్రకటించిన 17 జిల్లాలకు ఈ మూడు కలిపి మొత్తంగా 20 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో సీఎం కేసీఆర్ పలువురు ప్రజాప్రతినిధులు, మేధావుల నుంచి అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. కొత్తగా 17 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నప్పుడు వాటికి అదనంగా మరో మూడు కలపడం వల్ల జరిగే నష్టమేమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంలో కేసీఆర్‌దే తుదినిర్ణయమని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మరికొద్ది రోజుల్లో 20 కొత్త జిల్లాలతో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

More Telugu News