: ఇది అలాంటిలాంటి అక్టోబర్ కాదు సుమండీ... 800 ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తుంది!

సామాజిక మాధ్యమాలు అందుబాటులోకి వచ్చిన తరువాత మంచైనా, చెడు అయినా అంతులేని ప్రచారం లభిస్తోంది. తాజాగా ఇలాంటి ప్రచారం పొందుతున్న అంశమేంటంటే ఈ అక్టోబర్ నెల! ప్రతి ఏడూ వచ్చే అలాంటిలాంటి అక్టోబర్ నెల కాదిది... దాదాపు 8 శతాబ్దాలకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన అక్టోంబర్ అంటూ సోషల్ మీడియాలో అక్టోబర్ నెలపై పోస్టులు హల్ చల్ చేస్తున్నాయి. అంతే కాదు, కాకతీయుల పాలన కాలం నాటి అక్టోబర్ నెల ఇదేనని, మళ్లీ ఇన్నాళ్లకు వచ్చిందని సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు. ఈ అక్టోబర్ నెలలోకి వెళ్లి ఓ సారి వస్తే... 863 ఏళ్ల క్రితం అంటే క్రీస్తు శకం 1153వ సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చిన అరుదైన రోజులు మళ్లీ ఇన్నాళ్టికి వచ్చాయని పండితులు లెక్కలు కట్టి చెబుతున్నారు. అమావాస్య, పౌర్ణమి ఒకే నెలలో రావడం ఒక విశేషమైతే...11 న దసరా, 12 న మొహరం, 30 న దీపావళి ఈ మూడు పండుగలు ఒకేనెలలో రావడం మరో ప్రత్యేకత. సాధారణంగా నెలలో ఒక వారం మాత్రమే ఐదుసార్లు వస్తుంది. కానీ ఈ నెలలో మాత్రం శనివారాలు (1, 8, 15, 22, 29 తేదీలు), ఆదివారాలు(2, 9, 16, 23, 30 తేదీలు), సోమవారాలు (3, 10, 17, 24, 31 తేదీలు) ఐదేసి సార్లు రానున్నాయని పేర్కొంటున్నారు. అంతే కాకుండా, వేసవి సెలవుల తరువాత అత్యధిక సెలవులు వచ్చే నెల కూడా ఇదే కావడం విశేషం. ఎందుకంటే... దసరా సెలవులతో పాటు ఐదు ఆదివారాలు, రెండవ శనివారం కలిపి సుమారు 17 రోజులు పాఠశాలలు, కాలేజీలు, వివిధ సంస్థలకు సెలవులు కావడం విశేషం. ఇంతే కాకుండా మరిన్ని విశేషాల్లోకి వెళ్తే... అక్టోబర్ 1వ తేదీన ప్రపంచ శాకాహార, వృద్ధుల, జాతీయ రక్తదాన దినోత్సవాలు జరుపుకుంటారు. అంతే కాకుండా తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కూడా ఈ రోజు ప్రారంభమయ్యాయి. దసరాను పురస్కరించుకుని విజయవాడ కనకదుర్గ శరన్నవరాత్రులు కూడా ఈ రోజే ప్రారంభం. 2వ తేదీన జాతిపిత మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ జయంతులు. 3న వరల్డ్ అర్కిటెక్చర్ డే. 4న ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం, 5న టీచర్స్ డే 7న వరల్డ్ లాఫింగ్ డే 8న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ డే 10న ఇండియన్ పోస్టల్ డే 11న విజయ దశమి (దసరా)తో పాటు ప్రపంచ బాలికల దినోత్సవం కూడాను. 12న ముస్లింలు పవిత్రంగా జరుపుకునే మొహరం, మనదేశంలో సమాచార హక్కు చట్టం అమలులోకి వచ్చిన రోజు కూడా ఈ రోజే కావడం విశేషం. 13న అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిరోధక దినోత్సవం. 14న వరల్డ్ ఎగ్ డే జరుపుకుంటారు. 15న అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవం. 16న ప్రపంచ ఆహార దినోత్సవం, మహర్షి వాల్మికి జయంతి. 17న ప్రపంచ పేదరిక నిర్మూలన దినోత్సవం. 21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. 24న ఐక్య రాజ్య సమితి వ్యవస్థాపక దినోత్సవం. 26న గృహహింస చట్టం అమలులోకి వచ్చిన రోజు. 29న నరక చతుర్ధశి. 30న దీపావళి, హోమి జె.బాబా జయంతి, ప్రపంచ పొదుపు దినోత్సవం. 31వ తేదీన ఏక్తా దివాస్ గా జరుపుకునే సర్దార్ వల్లబాయ్ పటేల్ జయంతి ఉత్సవం. దీంతో ఈ నెల ఎంతో ప్రత్యేకతలను సంతరించుకుంది.

More Telugu News