: నయీం నా స్కూల్ మేట్... ఒకే స్కూల్ లో చదివాం, ఆడాం, పాడాం: బెల్లి లలిత సోదరుడు కృష్ణ

నయీం తన స్కూల్ మేట్ అని బెల్లి లలిత సోదరుడు బెల్లి కృష్ణ తెలిపారు. నయీం కారణంగా సుదీర్ఘ కాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన నేడు అజ్ఞాతం వీడారు. ఈ సందర్భంగా మీడియా ముందుకు వచ్చిన ఆయన పలు విషయాలు వెల్లడించారు. తెలంగాణ ఉద్యమం కోసమే తమ కుటుంబం బలైందని అన్నారు. తన సోదరిని పాటలు పాడి ప్రజలను చైతన్యవంతులను చేయవద్దని హెచ్చరించారని ఆయన తెలిపారు. 1999 మే 26న నల్లగొండ జిల్లా భువనగిరిలో న‌యీమ్ త‌న ముఠాతో క‌లిసి తన చెల్లెలు బెల్లి లలితను అత్యంత పాశవికంగా హత్య చేసిన తరువాత ఆయన ఢిల్లీ వెళ్లిపోయారు. 18 ఏళ్ల పాటు ఢిల్లీలో అజ్ఞాత జీవితం గడిపిన ఆయన, నయీం హతమవడంతో తిరిగి వచ్చానని తెలిపారు. తనను గొల్లకురుమ ప్రజలు కడుపులో పెట్టుకుని కాపాడుకున్నారని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న చివరి రెండేళ్లు తాను ఎక్కడెక్కడో ఉన్నానని ఆయన అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత అప్పటి హోం మంత్రి జానారెడ్డి దగ్గరకు నోముల నర్సింహయ్య తనను తీసుకెళ్లారని ఆయన తెలిపారు. అప్పుడు జానారెడ్డి తమతో ఒక మాట చెప్పారని ఆయన గుర్తు చేసుకున్నారు. 'కృష్ణ పరిస్థితి ఏమీ బాగాలేదు... ఇతను ఎక్కడున్నాడో నాకు కూడా తెలియనీయకుండా చూడాలి' అంటూ జేబులోంచి 10,000 రూపాయలు తీసిచ్చి, ఎక్కడో ఒకచోట క్షేమంగా ఉండు' అని సూచించారని ఆయన గుర్తు చేసుకున్నారు. నయీం, తాను స్నేహితులమేనని ఆయన చెప్పారు. నయీం, తాను ఒకే స్కూల్ లో చదువుకున్నామని, ఒకేచోట ఆడిపాడామని ఆయన గుర్తు చేశారు. తమ ఇద్దరిదీ ఒకే ఊరు కావడం వల్ల తాము స్నేహితులమని ఆయన చెప్పారు.

More Telugu News