: నేను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక కాలేదు.. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతూనే ఉన్నాను: వెంక‌య్య‌

కాంగ్రెస్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ విభజనను సహేతుకంగా చేయలేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఈరోజు తిరుపతిలోని పీఎల్‌ఆర్‌ గార్డెన్స్‌లో ఆయ‌న‌కు స‌న్మానం చేసిన సందర్భంగా వేదిక‌పై మాట్లాడుతూ.. ఏపీకి గ‌త ప్ర‌భుత్వం ఎంతో అన్యాయం చేసిందని అన్నారు. రాష్ట్రానికి రెవెన్యూ లోటును భ‌ర్తీ చేసేందుకు ఎన్డీఏ ప‌చ్చ‌జెండా ఊపింద‌ని చెప్పారు. రాష్ట్రానికి హోదాతో ఎన్ని లాభాలు క‌లుగుతాయో ఆ స్థాయిలోనే ప్ర‌యోజ‌నాల‌ను క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా ఏపీని పట్టించుకోలేని కాంగ్రెస్ ఇప్పుడు త‌మ‌ను విమర్శించడం హాస్యాస్ప‌ద‌మేన‌ని వెంకయ్య అన్నారు. పోలవరం ఇంకా పూర్తికాలేదని త‌మ ప్ర‌భుత్వం వచ్చిన‌ రెండేళ్లకే త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. మ‌రి దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ ఏపీకి ప్ర‌యోజ‌నాల్ని చేకూర్చే పోలవరం ఎందుకు పూర్తి చేయలేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. పోల‌వ‌రానికి అయ్యే మొత్తం ఖ‌ర్చును కేంద్రమే భరిస్తుందని చెప్పారు. విభజన బిల్లులోని అన్ని అంశాలపై ఏపీ మంత్రుల‌తో తాము చర్చిస్తూనే ఉన్నట్లు చెప్పారు. ‘ఐఐటీలు, ఎయిమ్స్ వంటివి చ‌ట్టంలోనే ఉన్నాయి.. మీరేంటి ఇచ్చేది అని అంటున్నారు. చ‌ట్టంలో ఉన్న ఎన్నో అంశాల‌ను గ‌తంలో కాంగ్రెస్ నెర‌వేర్చిందా?.. నెల్లూరు అభివృద్ధి చెందాలంటే ఆ ప్రాంత‌ ఎంపీ పార్లమెంటులో అడ‌గాలి, మ‌రో ప్రాంతం అభివృద్ధి చెందాలంటూ ఆయా ప్రాంతాల ఎంపీలు అడ‌గాలి. కానీ ఆనాడు క‌ర్ణాట‌క నుంచి రాజ్య‌స‌భ‌కు ఎంపికైన నేను ఏపీకి ప్ర‌త్యేక హోదా కోసం రాజ్య‌స‌భ‌లో అడిగాను. ఇప్పుడు కూడా నేను వేరే రాష్ట్రం నుంచే రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యాను. అయిన‌ప్ప‌టికీ నేను రాష్ట్రానికి చేసే సేవ‌ మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది’ అని వెంకయ్య వ్యాఖ్యానించారు.

More Telugu News