: జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ ఫేస్‌బుక్‌లో మహిళ పోస్టింగ్.. కేసు నమోదు చేసిన పోలీసులు

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ గత కొన్ని రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే. స్వల్ప అస్వస్థతతో బాధపడుతున్న జయలలిత పది రోజుల క్రితం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం విదితమే. రెండు రోజులుగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ఎటువంటి బులెటిన్ విడుదల చేయలేదు. దీంతో సామాజిక మాధ్యమాల్లో సీఎం ఆరోగ్య పరిస్థితిపై వదంతులు మొదలయ్యాయి. వాటిని నమ్మవద్దని ఏఐఏడీఎంకే నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వదంతుల నేపథ్యంలో జయలలిత చికిత్స పొందుతున్న అపోలో ఆస్పత్రి వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాజాగా ఓ మహిళ జయలలిత ఆరోగ్యం క్షీణించిందంటూ ఫేస్‌బుక్‌ పోస్టు పెట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. వదంతులు పుట్టించిన పదిమంది డీఎంకే కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జయలలిత ఆరోగ్య పరిస్థితిని వెంటనే వెల్లడించాలని, లేదంటే వదంతులకు మరింత ఆస్కారం ఇచ్చినట్టు అవుతుందని డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కోరారు. జయలలిత త్వరగా కోలుకోవాలంటూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు, ఆమె అభిమానులు పూజలు చేస్తున్నారు.

More Telugu News