: పాక్ నటుల వ్యవహారంపై సల్మాన్, సైఫ్, దీపికలకు కౌంటర్ ఇచ్చిన మహారాష్ట్ర నవనిర్మాణసేన

పాకిస్థాన్ సినీ నటులకు మద్దతుగా నిలిచిన బాలీవుడ్ నటులు సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, దీపికా పదుకునేలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన కౌంటర్ ఇచ్చింది. ఈ మేరకు మీడియాతో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) నేత అమేయ్ ఖోపర్ మాట్లాడుతూ, చాలా మంది సమర్థిస్తున్నట్లు పాకిస్థానీ నటుల్లో ఒక్కరు కూడా వర్క్ పర్మిట్లు తీసుకోలేదన్నారు. టూరిస్ట్ వీసాపై ఇండియాకు వచ్చి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారని ఆయన చెప్పారు. ఇలా నటించడం చట్టవ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. ఇకపై ఇలా జరగకుండా చూసేందుకు దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు పాకిస్థానీ నటులు కనిపిస్తే దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. వారు నటించే సినిమాల నిర్మాణాలను అడ్డుకుంటామని ఆయన స్పష్టం చేశారు. దీనిపై దర్శక దిగ్గజం శ్యామ్ బెనగల్ స్పందించారు. నిర్మాణంలో ఉన్న సినిమాల నుంచి తప్పుకోవడంలో పాక్ నటుల తప్పేమీ లేదని అన్నారు. నటీనటుల విషయంలో పాక్ ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపులేదని ఆయన స్పష్టం చేశారు. నిజానికి భారతీయులకు పాకిస్థానీల పట్లగానీ, అక్కడివాళ్లకు ఇక్కడివాళ్లపైగానీ ఎలాంటి విద్వేషాలు లేవని, వివాదాలు ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వాల మధ్య ఉన్న వివాదాలను కొన్ని రాజకీయపార్టీలు వినియోగించుకుంటాయని ఆయన తెలిపారు.

More Telugu News