: మనమెందుకు తన్నుకోవాలి... వీళ్లకు పోటీలు పెడదాం.. ఆస్వాదిద్దాం!: పాక్ కమేడియన్ ట్వీట్

యుద్ధం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం, వైరాగ్యం తప్ప ఏమీ సాధించలేము అంటూ గతంలో ఓ యోధుడు చెప్పినట్టు పాకిస్థాన్ లోని కరాచీకి చెందిన ప్రముఖ కమేడియన్‌ షెహజాద్‌ ఘియాస్‌ షేక్‌య అనే కామెడీ నటుడు తన ఫేస్ బుక్ పేజ్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 70 ఏళ్లుగా ఇరుగు పొరుగుగా ఉంటున్నప్పుడు ఎవరి మధ్యనైనా పొరపొచ్చాలు రావడం సహజమని అన్నాడు. ఇది ప్రతి ఇంట్లో ఉండే సమస్యేనని తెలిపాడు. ఈ మాత్రానికే కొట్టుకుని విడిపోతామా? అని ఆయన ఆయన అన్నాడు. యుద్ధం కంటే మన రెండు దేశాల మధ్య ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలేంటంటే... మన రెండు దేశాల సరిహద్దుల వద్ద ఆసక్తికరమైన పోటీలు పెడదామని సూచించాడు. భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఛాయ్ అమ్మడంలో ఎంతో అనుభవం ఉందని ప్రపంచం అంతా చెప్పుకుంటోంది. పాకిస్థాన్ అధ్యక్షుడు మమ్నూన్‌ హుస్సేన్‌ ను దహీ బల్లా (పెరుగు, ఆలు, వడతో తయారు చేస్తారు. ఉత్తర భారతం, పంజాబ్‌లో ఫేమస్‌ డిష్‌) తయారు చేయడంలో మించినవారు లేరు. వీరిద్దరి మధ్య మంచి పోటీపెట్టి అంతర్జాతీయ ప్రతినిధులను ఆహ్వానించి రుచిచూపిద్దాం. అది వద్దంటే... షారుఖ్‌ ఖాన్, పాకిస్తాన్‌ సినీ నటుడు, దర్శకుడు సాహిర్‌ లోధి మధ్య యాక్టింగ్‌ పోటీ పెడదామని, అది చూసి ఆస్వాదిద్దామని చెప్పాడు. ఇంకా కావాలంటే సింగర్, సంగీత దర్శకులు హిమేష్‌ రేషమియా, తాహిర్‌ షాల మంచి పాటల కచేరీ నిర్వహిద్దామని, వాటిని ఆస్వాదిద్దామని ఆయన సూచించాడు. ఈ పోటీ ఇంకా రక్తి కట్టాలంటే రాహుల్ గాంధీ, బిలావల్ భుట్టో మధ్య స్పెల్ బీ పోటీలు పెడదామని సూచించాడు. పాక్‌ టీవీనటి మీరా, బిగ్ బాస్ షో కంటెస్టెంట్ అస్మిత్ పటేల్ మధ్య గాఢమైన చుంబనం చూసి ఆనందిద్దామని పిలుపునిచ్చాడు. 'సర్జికల్‌ దాడులు చేసి ఇప్పుడు పైచేయి అనిపించుకున్నావు. కానీ ‘సాస్‌ బీ కబీ బహూ తీ’ అనే విషయాన్ని మరచిపోతున్నావు. కొట్లాడుకుంటే ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ అంటూ సూచించాడు. "మనమధ్య కొట్లాడుకోవడాలు బంద్ చేద్దాం. మనం కలిసి ఇతరులతో గిల్లికజ్జాలు పెట్టుకుందాం. మనం మాత్రం గిల్లి దండ ఆడుకుందాం. మనం మాట్లాడుకుందాం, ఆటలాడుకుందాం" అంటూ ఆయన పిలుపునిచ్చాడు. ఇది సోషల్ మీడియాలో ఆకట్టుకుంటోంది.

More Telugu News