: చెత్త‌ర‌హిత ప్రాంతాల్లోనే మ‌న‌సుకు ప్ర‌శాంత‌త ల‌భిస్తుంది: ప్రధాని మోదీ

చెత్త‌ర‌హిత ప్రాంతాల్లోనే మ‌న‌సుకు ప్ర‌శాంత‌త ల‌భిస్తుందని భార‌త‌ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ అన్నారు. దేశంలో స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మం ప్రారంభించి ఎల్లుండితో రెండు సంవత్స‌రాలు పూర్తి కానున్న నేప‌థ్యంలో దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని విజ్ఞానభ‌వ‌న్‌లో ఈరోజు పారిశుద్ధ్య స‌మ్మేళ‌నం పేరిట కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మోదీ ప్ర‌సంగిస్తూ.. స్వ‌చ్ఛభార‌త్ కోసం మీడియా విస్తృతంగా ప్ర‌చారం చేసిందని కొనియాడారు. స్వ‌చ్ఛ‌భార‌త్‌ను ప్ర‌జలే విజ‌య‌వంతం చేశారని ఆయ‌న పేర్కొన్నారు. ‘బంధువులు ఇంటికి వ‌స్తున్నారంటే ఇంటిని అందంగా ముస్తాబు చేస్తారు... కానీ, ఊరి ప‌రిశుభ్ర‌త‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు. కొన్ని సంస్థ‌లు స్వ‌చ్ఛ భార‌త్ ను చేప‌ట్ట‌డం నామోషీగా భావిస్తున్నాయి. ఎన్నిక‌ల‌పై ఆలోచించే నాయ‌కులు స్వ‌చ్ఛ‌తా కార్య‌క్ర‌మాలు చేప‌ట్టే ధైర్యం చేయ‌డం లేదు. చంఢీగ‌ఢ్, మైసూర్ వంటి ప్రాంతాలే ఎందుకు పుర‌స్కారాలు అందుకుంటున్నాయి? న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల‌న్నింటినీ చెత్త‌ర‌హిత ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. అప్పుడే స్వ‌చ్ఛ భార‌త్ అతి త‌క్కువ కాలంలోనే ల‌క్ష్యాన్ని చేరుకుంటుంది. దీనిపై మ‌రింత శ్ర‌ద్ధ వ‌హించాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌న సొంత ప్రాంతాలను సుర‌క్షితంగా చూసుకుంటాం. ఊరు, స‌మాజాన్ని కూడా అంద‌రూ ప‌ట్టించుకోవాలి.. అందరూ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొనాలి’ అని మోదీ వ్యాఖ్యానించారు.

More Telugu News