: 14 మంది భారత జవాన్లను హతమార్చామంటూ పాక్ మీడియా తప్పుడు కథనాలు.. సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్ర

భారత్ మెరుపు దాడులతో ఫీజులు ఎగిరిపోయిన పాక్ ఇప్పుడు భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే పనిలో పడింది. తప్పుడు కథనాలతో తమ దేశ పౌరులను మభ్యపెట్టడమే కాకుండా భారత సైనికులపైనా పైచేయి సాధించాలని చూస్తోంది. ఈ మేరకు నియంత్రణ రేఖ వద్ద తాము 14 మంది భారత సైనికులను మట్టుబెట్టినట్టు పాక్ మీడియా గురువారం కల్పిత వార్తలు ప్రచురించింది. పాక్ సైన్యాన్ని ఉటంకిస్తూ రాసిన ఈ వార్తల్లో 14 మంది భారత సైనికులను పాక్ దళాలు హతమార్చాయని, చందుబాబులాల్ చౌహాన్(22) అనే భారతీయ సైనికుడిని దళాలు అదుపులోకి తీసుకున్నాయని రాశాయి. జియో న్యూస్ 14 మంది భారత సైనికులు అని పేర్కొనగా, ‘డాన్’ 8 మంది అని పేర్కొనడం గమనార్హం. అయితే పాక్ సైనిక్ వెబ్‌సైట్‌లో మాత్రం ఈ ఘటనకు సంబంధించి ఎటువంటి వివరాలు లేకపోవడం విశేషం. పాక్ మీడియా కథనాలను భారత్ తీవ్రంగా ఖండించింది. అవి నిరాధార, అవాస్తవ కథనాలని పేర్కొంది. భారత్ తన ఖండనను ప్రకటించిన కాసేపటికే డాన్ పత్రిక తన వెబ్‌సైట్ నుంచి భారత సైనికులను హతమార్చిన కథనాన్ని ఉపసంహరించుకుంది. కాగా చందుబాబులాల్ నిర్బంధంపై పాక్ చేసిన ప్రకటనపై భారత ఆర్మీ స్పందించింది. బాబులాల్ పొరపాటున ఎల్‌వోసీ దాటి పాక్ భూభాగంలో ప్రవేశించారని, ఈ విషయాన్ని డీజీఎంవో పాకిస్థాన్‌కు తెలియజేశారని పేర్కొంది. సంప్రదింపుల ద్వారా తిరిగి ఆయనను భారత్ రప్పిస్తామని తెలిపింది.

More Telugu News