: మా సైన్యం కూడా తగిన సమాధానం చెబుతుంది: పాక్ రక్షణ మంత్రి

‘భారత సైన్యం నియంత్రణ రేఖను ఉల్లంఘించి మా భూభాగంలోకి వచ్చింది. మా సైన్యం కూడా దీనికి తగిన సమాధానం చెబుతుంది’ అని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ అన్నారు. ఈ దాడిలో తమ సైనికులు ఇద్దరు మరణించారని, 9 మందికి గాయాలయ్యాయని వెల్లడించారు. అయితే, పాక్ సైన్యం స్పందన మాత్రం భిన్నంగా వుంది. అసలు ఇటువంటి దాడులే జరగలేదని ప్రకటిస్తోంది. సరిహద్దుల వెంబడి జరిగే కాల్పులను భారత సైన్యం సర్జికల్ స్ట్రయిక్స్ అంటూ అబద్ధాలు ఆడుతోందని, తమ భూభాగంపై ఈ తరహా దాడులు జరిగితే కనుక తగిన సమాధానం చెబుతామని పాక్ సైన్యం చెబుతుండటం గమనార్హం. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా మహ్మద్ ఆసిఫ్ మూడు రోజుల క్రితం జియో టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తమ వద్ద అవసరమైన వాటి కంటే వ్యూహాత్మక ఆయుధాలు ఎక్కువగానే ఉన్నాయని, పరిస్థితులను బట్టి అవసరమైతే, భారత్ పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు. అయితే, ఉగ్రవాద స్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ అనంతరం ఆయన డీలా పడినట్టు కనిపిస్తోందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.

More Telugu News