: 48 నిమిషాల్లో.. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోకి.. మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయిన భారత్ సైనికులు ఏం చేశారంటే...!

యూరీ ఘటన అనంతరం పాకిస్థాన్ క్షణానికో ప్రకటన చేస్తుండడంతో ఆ దేశానికి గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించిన భారత సేనలు, గత రాత్రి ఆకస్మికంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో మూడు కిలోమీటర్ల లోపలికి చొచ్చుకుపోయాయి. మేకపోతు గాంభీర్యంతో బీరాలు పలుకుతున్న పాకిస్థాన్ ను మౌనంగా దెబ్బకొట్టాలని నిర్ణయించింది. దీంతో సరిహద్దుల ఆవల ఏం జరుగుతోందోనని ఓ కన్నేసి ఉంచిన భారత్ నిఘా వర్గాలు... సరిహద్దుల్లోని తీవ్రవాద శిబిరాలను తరలించే క్రమంలో వారందర్నీ ఒక చోటకు చేర్చినట్టు గుర్తించాయి. ఇదే సమయంలో వారిని భారత్ పైకి ఉసిగొల్పేందుకు ఐఎస్ఐ, పాక్ ఆర్మీ సన్నాహాలు చేసుకుంటున్నాయని ఉప్పందగానే...భారత సైనికులు విరుచుకుపడ్డారు. వివిధ సెక్టార్లలోని 6 నుంచి 8 ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పారా కమాండోస్ ను వినియోగించారు. ఆయా ప్రదేశాల్లోకి వీరిని హెలికాప్టర్ల ద్వారా దించారు. మృతుల్లో ఉగ్రవాదులతో పాటు వారికి గైడ్లుగా వ్యవహరించే వారు, శిబిర నిర్వాహకులు కూడా ఉన్నారు. కేవలం 48 నిమిషాల వ్యవధిలో శత్రుదేశంలోకి మూడు కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి...38 మంది ముష్కరులను మట్టుబెట్టారు. ఏడు టెర్రరిస్టు క్యాంపులను నేలమట్టం చేశారు. ఎంత వేగంగా వెళ్లారో అంతే వేగంగా వెనక్కి వచ్చేశారు. ఏం జరుగుతోందని పాక్ తెలుసుకునేలోపు భారత సేనలు ఆపరేషన్ ముగించి స్వదేశం చేరడం విశేషం. దీంతో భారత్ తీవ్రమైన హెచ్చరికలు చేసింది. దొడ్డిదారిలో ఎప్పటికప్పుడు దెబ్బతీయడం మీ పని అయితే, మేము కళ్లు తెరిస్తే మీరు తుడిచిపెట్టుకుపోతారన్న బలమైన సందేశం ఇచ్చింది. అదే సమయంలో ప్రపంచ దేశాల (ప్రధానంగా చైనా)కు తమ సహనానికి కూడా హద్దుంటుందన్న సూచనలు పంపింది. దీంతో భారత్ లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుండగా, పాక్ లో మాత్రం తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News