: పెరుగుతున్న విమానాలకు విమానాశ్రయాల్లో చోటేదీ?

దేశంలో విమానయాన రంగం ఇప్పుడు మంచి జోష్ మీదుంది. ఒకప్పుడు విమానంలో ప్రయాణించడం మధ్య తరగతి వాసుల కల. నేడు అది సాధారణంగా మారిపోయింది. ఆదాయార్జన స్థాయి పెరగడం, అదే సమయంలో విమానయాన చార్జీలు దిగిరావడం ఈ పరిస్థితికి కారణం. విమానయాన ఇంధన ధరలు సైతం తగ్గుముఖం పట్టడం, ప్రయాణికుల సంఖ్య పెరుగుదలతో విమానయాన సంస్థలకు లాభాలు దండిగా వస్తున్నాయి. ఈ పరిస్థితుల నుంచి మరింత లబ్ధి పొందేందుకు విమానయాన సంస్థలు అదనపు సర్వీసుల పెంపుపై ఉత్సాహంగా ఉన్నాయి. లీజుకు తీసుకునే, కొనుగోలు చేసే విమానాల సంఖ్య పెరుగుతోంది. ఇదంతా నాణేనికి ఒకవైపు. మరి రెండో వైపు...? దేశీయంగా ఉన్న విమానాశ్రయాలు ప్రస్తుతం విమానాలతో నిండిపోతున్నాయి. కొత్తగా వచ్చే విమాన సర్వీసులకు చోటు దక్కే పరిస్థితి కనిపించడం లేదు. ఇప్పటికే అదనపు అరైవల్ (విమానాలు దిగేందుకు), డిపార్చర్ (టేకాఫ్) కు స్లాట్ లు దొరకడం గగనంగా మారింది. ఇక రానున్న ఏళ్లలో కొత్తగా వచ్చి చేరే వందలాది విమానాలకు సమయం కేటాయించం కష్టంగా మారిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో ఇటీవల ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ ఉన్నతాధికారుల సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. విమానయాన సంస్థలు, విమానాశ్రయాల నిర్వాహకుల ప్రతినిధులతో ఓ కమిటీని ఏర్పాటు చేసి అదనపు ట్రాఫిక్ కు తగినట్టు రన్ వేల సామర్థ్యాన్ని విస్తరించడంపై దృష్టి పెట్టాలని ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అధికారులు కోరారు. ఎన్ని విమానాలను కొనుగోలు చేసేదీ, లీజుకు తీసుకునేదానిపై వివరాలు కోరగా కేవలం కొన్ని సంస్థలే స్పందించాయి. ఢిల్లీ విమానాశ్రయంలో ప్రస్తుతం మూడు రన్ వేలు ఉన్నాయి. అయినప్పటికీ రద్దీ వేళల్లో విమానాల ల్యాండింగ్ కు, టేకాఫ్ కు స్లాట్ లభించడం కష్టంగా ఉంది. ముంబై విమానాశ్రయంలోనూ ఇదే పరిస్థితి. దీనివల్ల విమానాల్లో ప్రయాణించే వారి సంఖ్య తగ్గుతుందన్న ఆందోళనను విమానయాన సంస్థలు వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News