: పాక్ తో మ్యాచ్ లో ఓడిపోయి మన సైనికులను నిరాశపరచం: హాకీ జట్టు కెప్టెన్

సైనికుల కోసం పాకిస్థాన్ ను చిత్తుగా ఓడిస్తామని భారత హాకీ జట్టు కెప్టెన్ పీఆర్ శ్రీజేష్ తెలిపాడు. మలేసియాలో వచ్చే నెల 20 నుంచి 30 వరకు జరగనున్న ఆసియన్ చాంపియన్స్ ట్రోఫి టోర్నమెంట్ లో పాకిస్థాన్ తో భారత హాకీ జట్టు తలపడనుంది. కశ్మీర్ లోని యూరీ సెక్టార్ పై ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మ్యాచ్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది. ఈ సందర్భంగా కెప్టెన్ శ్రీజేష్‌ మాట్లాడుతూ, పాకిస్థాన్ హాకీ టీమ్ చేతిలో ఓడిపోయి భారత సైనికులను నిరాశ పరచాలని కోరుకోవడం లేదని అన్నాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ లో వందశాతం కష్టపడతామని చెప్పాడు. ఈమ్యాచ్ లో ఓటమిపాలు కావడం ద్వారా మన సైనికులను నిరుత్సాహపరచాలని భావించడం లేదని ఆయన స్పష్టం చేశాడు. దేశ సరిహద్దులో ఎదురుకాల్పుల్లో ప్రాణాలర్పించిన సైనికుల కోసమైనా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తామని ఆయన తెలిపాడు. నానాటికి తీసికట్టు ఆటతీరుతో పాకిస్థాన్ ఒలింపిక్స్ కు అర్హత కూడా సాధించలేకపోయిందని ఆయన గుర్తు చేశాడు. అయితే తనదైన రోజున పాక్ టీమ్ ప్రపంచంలోని ఏ జట్టునైనా ఓడించగలదని కూడా అన్నాడు. ఈ టోర్నీలో మలేసియా, కొరియా జట్లను తక్కువగా అంచనా వేయడానికి వీలులేదని హెచ్చరించాడు.

More Telugu News