: వెంకయ్య నాయుడిపై నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శలు

కేంద్ర‌మంత్రి వెంకయ్యనాయుడుపై టీఆర్ఎస్ నాయ‌కురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత విమర్శలు గుప్పించారు. ఈరోజు హైద‌రాబాద్‌లోని తెలంగాణ భ‌వ‌న్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఇటీవ‌ల వ‌చ్చిన భారీ వ‌ర్షాల కార‌ణంగా త‌లెత్తిన‌ వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంతాల్లో ప్ర‌జ‌ల‌కు తెలంగాణ జాగృతి సాయం అందించిందని అన్నారు. ‘వెంక‌య్య‌నాయుడుకు వ‌ర‌ద అంటే గుంటూరు.. విమోచ‌న‌మంటే తెలంగాణ’ గుర్తుకొస్తుందని ఆమె ఎద్దేవా చేశారు. ఏపీలో వ‌ర‌ద‌పై స‌ర్వే చేసిన వెంక‌య్య‌ తెలంగాణ‌లోనూ వ‌ర‌ద ప‌రిస్థితిపై స‌ర్వే చేస్తే బాగుంటుందని ఆమె అన్నారు. ఏపీకి, తెలంగాణ‌కు వ‌ర‌ద సాయం స‌మానంగా ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా, ఈరోజు బతుకమ్మ పాటల యాప్‌ను విడుదల చేసినట్లు కవిత పేర్కొన్నారు. ఈ ఏడాది 1100 చోట్ల బ‌తుక‌మ్మ పండుగను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. 9 దేశాల్లో బ‌తుక‌మ్మ సంబురాలు జ‌రప‌నున్న‌ట్లు పేర్కొన్నారు. మిడ్ మానేరుపై ప్రతిపక్షాలు అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.

More Telugu News