: హ‌రీశ్‌రావు, దేవినేని కలసి అన్న‌ద‌మ్ముల్లా ఆలోచించాలి: టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి

ప్రాజెక్టుల నుంచి నీటి విడుద‌ల అంశంపై తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల భారీ నీటి పారుద‌ల శాఖ మంత్రులు హ‌రీశ్‌రావు, దేవినేని ఉమా మ‌హేశ్వ‌రరావులు అన్న‌ద‌మ్ముల్లా ఆలోచించాల‌ని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి సలహా ఇచ్చారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌నంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న ఈరోజు మాట్లాడుతూ... రాయ‌ల‌సీమ‌, నెల్లూరు, ప్ర‌కాశం జిల్లాలు సాగునీటి కోసం అల్లాడుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. నాగార్జున సాగ‌ర్‌కు నీరు విడుదల చేయాల‌న్న అంశంపై బోర్డు నిష్ప‌క్ష‌పాతంగా వ్య‌వ‌హ‌రించి, ఓ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. శ్రీ‌శైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా 500 క్యూసెక్కులు విడుద‌ల చేయ‌డ‌మేంట‌ని సోమిరెడ్డి ప్ర‌శ్నించారు. చెన్నైకి కూడా అక్క‌డి నుంచే నీరు విడుద‌ల చేయాల్సి ఉంద‌ని, ఉమ్మ‌డి రాష్ట్రంలో అందుకోసం ఒప్ప‌దం జ‌రిగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు క‌లిసే నీరు విడుద‌ల చేయాలని ఆయ‌న అన్నారు. రాయ‌లసీమ‌లో అత్య‌ల్ప‌ వ‌ర్ష‌పాతం ప‌డుతోందని ఆ ప్రాంతానికి నీటి విడుద‌ల‌పై కృష్ణా బోర్డు దృష్టిపెట్టాల‌ని ఆయ‌న కోరారు.

More Telugu News