: లేని వ్యాధిని ఉందని చెప్పడంతో 46 ఏళ్లుగా వీల్‌ఛైర్‌కే ప‌రిమిత‌మైపోయిన వ్యక్తి.. 60 ఏళ్ల వయసులో నడక నేర్చుకున్నాడు!

వైద్యులు ఇచ్చిన‌ త‌ప్పుడు నివేదిక‌తో 46 ఏళ్లుగా వీల్‌ఛైర్‌కే ప‌రిమిత‌మైపోయిన పోర్చుగీస్‌కి చెందిన రుఫినో బొర్రె అనే 60 ఏళ్ల వ్య‌క్తి తాజాగా మ‌ళ్లీ న‌డ‌క‌నేర్చుకున్నాడు. రుఫినోకి 13 ఏళ్ల వయస్సులో వ్యాధి సోకడంతో ఆయ‌న‌ను కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రిలో చేర్పించారు. అయితే ఆయ‌న‌కు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన వైద్యులు రుఫినోకి లేని వ్యాధి ఉన్న‌ట్లు పొర‌పాటు ప‌డ్డారు. ఆయ‌న‌కి సోకింది మస్కులర్‌ డిస్ట్రోపీ అనే వ్యాధి అని చెప్పారు. వ్యాధి వ‌ల్ల‌ రుఫినో ఇక‌ నడవలేడని చెప్పారు. ఇక‌పై వీల్‌చైర్‌కే ప‌రిమితం కావాల‌ని పేర్కొన్నారు. ఆ వ్యాధికి చికిత్స లేదని స్ప‌ష్టం చేశారు. దీంతో రుఫినో కింద‌కాలు పెట్ట‌కుండా ఇన్నేళ్లుగా వీల్‌ఛైర్‌లోనే గ‌డిపాడు. అయితే, 2010లో ఓ ప్ర‌ముఖ‌ న్యూరాలజిస్ట్‌ రుఫినోకి 46 ఏళ్ల క్రితం వైద్యులు ఇచ్చిన‌ రిపోర్టులు చూశాడు. అనుమానం వచ్చిన వైద్యుడు రుఫినోకి మ‌ళ్లీ పరీక్షలు నిర్వహించాడు. అందులో రుఫినోకి మైస్తేనియాగా(కండరాల బలహీనత)తో మాత్ర‌మే బాధ‌ప‌డుతున్నాడ‌ని, మస్కులర్‌ డిస్ట్రోపీ అనే వ్యాధితో కాద‌ని తేల్చాడు. ఈ వ్యాధిని నయం చేయవచ్చని కూడా పేర్కొన్నాడు. దీంతో త‌న వ్యాధికి చికిత్స తీసుకున్న త‌రువాత రుఫినో నేలపై కాళ్లు పెట్టి మెల్లిగా న‌డ‌క నేర్చుకున్నాడు. సంవత్స‌రానికి రెండు సార్లు వైద్యుడి వ‌ద్ద‌కు వెళ్లి సూచ‌న‌లు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం రుఫ‌ినో పూర్తిగా కోలుకున్నాడు. మామూలుగా నడుస్తూ అన్ని ప‌నులు చేసుకుంటున్నాడు. అయితే, 1960లో మైస్తేనియా అనే వ్యాధి ఉన్నట్టుగా వైద్యశాస్త్రంలో లేద‌ట‌. దీని కార‌ణంగా తాను శాశ్వ‌తంగా వీల్‌చైర్ కే ప‌రిమితం కావాల‌ని చెప్పిన ఆసుప‌త్రిపై ఆయ‌న కేసు పెట్ట‌లేకపోతున్నాడు.

More Telugu News